
జిల్లాలో విద్యుత్ బకాయిలు రూ.600 కోట్లు
మార్కాపురం: జిల్లాలో సుమారు 600 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు ఉన్నాయని, వీటి వసూలుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని ఆ శాఖ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం సాయంత్రం మార్కాపురం ఈఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా వెలుగొండ ప్రాజెక్టు రెండు టన్నెల్స్ విద్యుత్ బకాయిలు సుమారు రూ.97 కోట్లు ఉన్నాయని, ఇంకా ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్‌డబ్ల్యూఎస్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ల నుంచి అధిక మొత్తంలో బకాయిలు వసూలు కావాల్సి ఉందని చెప్పారు. జిల్లాకు 1200 ట్రాన్స్‌ఫార్మర్లు అవసరం కాగా ఇప్పటి వరకు 300 వచ్చాయని, మిగిలినవి మరో మూడు నెలల్లో వస్తాయని చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో వెయ్యి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని ఇంకా 2,500 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. మార్కాపురం డివిజన్‌లో 600 మంది రైతులకు వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చామని, ఇంకా 1200 మంది రైతులకు ఇవ్వాల్సి ఉందని వివరించారు.
సబ్‌స్టేషన్లు మంజూరు
గిద్దలూరు నియోజకవర్గంలోని కొమరోలు మండలంలోని కసినేపల్లి, రాచర్ల మండలంలోని మేడవారిపల్లి, పొదిలిమండలంలోని ఏలూరు, కురిచేడు మండలంలోని కల్లూరు, యర్రగొండపాలెం మండలంలోని గండిబావి చెరువు, కందుకూరు మండలంలోని మన్నేటికోట, కనిగిరిలోని గార్లపేట రోడ్డు, సంతనూతలపాడు మండలంలోని బూదవాడ, ఒంగోలులోని మంగమ్మ కాలేజీ వద్ద, ఒంగోలు పట్టణంలోని హౌసింగ్ బోర్డులో, టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెంలో విద్యుత్ సబ్‌స్టేషన్లు మంజూరు కాగా వీటిలో కొన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.
పశుపోషకులకు నష్టపరిహారం ఇస్తాం
మార్కాపురం మండలంలోని తిప్పాయిపాలెం–చింతగుంట్ల గ్రామాల మధ్య హెచ్‌టీ విద్యుత్ లైన్లు తగిలి 18 గేదెలు మృతి చెందాయని, వీటి యజమానులకు ఒక్కో గేదెకు రూ.40 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ఎస్‌ఈ పేర్కొన్నారు. శుక్రవారం డీఈ, ఏడీఈ, ఏఈతో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి పశుపోషకులతో మాట్లాడినట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ప్రజలు కూడా రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ వాడకం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే సమయంలో ఇంట్లో గీజర్, హీటర్, ఇతర విద్యుత్ ఉపకరణాలు వినియోగించవద్దని స్పష్టం చేశారు. అనంతరం డివిజన్‌లోని విద్యుత్ అఽధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఈఈ నాగేశ్వరరావు, ఎడిఈ సియా నాయక్, ఏఈలు నాగేందర్‌రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
చింతగుంట్ల వద్ద్ద మృతి చెందిన గేదెలకు
పరిహారం ఇస్తాం
వర్షా కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
విద్యుత్ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు