
రైలు నుండి జారిపడి వృద్ధుడు మృతి
కురిచేడు: రైలు నుంచి జారిపడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన కురిచేడు–గుండ్లకమ్మ రైల్వేస్టేషన్ల మధ్య శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. నంద్యాల–గుంటూరు మార్గంలో 103–15–16 మైల్ స్టోన్ వద్ద రైల్వే ట్రాక్‌పై శుక్రవారం ఓ వృద్ధుడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. వృద్ధుడి మృతదేహంపై తెల్లని చొక్కా, తెల్లని పంచె ఉన్నాయి. వయసు సుమారు 60 ఏళ్లు ఉండవచ్చని అంచనా. మృతదేహాన్ని రైల్వే పోలీసులు వినుకొండలోని మార్చురీలో భద్రపరిచారు. ఆచూకీ తెలిసిన వారు 9440438256, 7013600365ను సంప్రదించాలని రైల్వే పోలీసులు కోరారు.
నర్సాపూర్–హుబ్లీ రైళ్లకు అదనపు బోగీలు
మార్కాపురం: ఈనెల 29వ తేదీ నుంచి మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే నర్సాపురం–హుబ్లీ, నర్సాపురం–అమరావతి ఎక్స్‌ప్రెస్(నంబర్లు : 17225/17226) రైళ్లకు రెండు ఏసీ 2 టైర్, ఒక స్లీపర్ అదనపు బోగీలను శాశ్వత ప్రాతిపదికపై ఏర్పాటు చేస్తున్నారని గుంటూరు రైల్వే డివిజన్ డీఆర్‌యూసీసీ మెంబర్ ఆర్‌కేజే నరసింహం తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుంచి మార్కాపురం మీదుగా వెళ్లే మచిలీపట్నం–యశ్వంత్‌పూర్, మచిలీపట్నం–కొండవీడు ఎక్స్‌ప్రెస్ రైలుకు శాశ్వత ప్రాతిపదికన ఒక అదనపు ఏసీ త్రీటైర్ బోగీ అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. ఇందులో ఒక ఏసీ ఫస్ట్ క్లాస్, 2 ఏసీ టూటైర్, 7 ఏసీ త్రీటైర్, 6 స్లీపర్, ఒక జనరల్, ఒక బ్రేక్ వ్యాన్, ఒక పవర్‌కార్ బోగీలు ఉంటాయని వివరించారు. మార్కాపురం మీదుగా గుంటూరు–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌కు ఈనెల 27 నుంచి శాశ్వత ప్రాతిపదికన ఒక స్లీపర్, ఒక జనరల్ బోగీని అదనంగా రైల్వే అధికారులు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈనెల 25నుంచి మార్కాపురం మీదుగా వెళ్లే గుంటూరు–ఔరంగాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలుకు మరొక అదనపు స్లీపర్ బోగీని శాశ్వత ప్రాతిపదికపై రైల్వే అధికారులు ఏర్పాటు చేశారని వెల్లడించారు.