అంబేడ్కర్‌ను అవమానించినా కేసుల్లేవ్
జరుగుమల్లి(సింగరాయకొండ): రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండపి నియోజకవర్గంలో అంబేడ్కర్ ఊరేగింపును అడ్డుకున్నా పోలీసులు చర్యలు తీసుకోకుండా ఓ వర్గానికి కొమ్ముకాయడం దారుణమని దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. జరుగుమల్లి మండలం కె బిట్రగుంట గ్రామంలో ఏప్రిల్ 14వ తేదీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజున ఊరేగింపును అడ్డుకున్న అగ్రవర్ణాల వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసు కట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సై బి.మహేంద్రను సస్పెండ్ చేయాలని కోరుతూ శుక్రవారం దళిత సంఘం నాయకుడు నీలం నాగేంద్రం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కె.బిట్రగుంటలో బుధ్దుడు, అంబేడ్కర్ చిత్రపటాల ఊరేగింపును అగ్రవర్ణాల వారు అడ్డుకున్న సమయంలో సింగరాయకొండ సీఐ సీహెచ్ హజరత్తయ్య, జరుగుమల్లి ఎస్సై బి.మహేంద్ర వచ్చి దళితులకు సూక్తులు చెప్పారే తప్ప కార్యక్రమ నిర్వహణకు సహకరించలేదని ఆరోపించారు. దీనిపై ఏప్రిల్ 29వ తేదీన ఫిర్యాదు చేసినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో దళితులు అన్యాయానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో వినతిపత్రం అందజేశారు. పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
అధికార పార్టీ నేతలకు తొత్తుగా మారిన
ఎస్సైని సస్పెండ్ చేయాలి
దళిత మంత్రి స్వామి నియోజకవర్గంలో
ఘటన జరగడం దారుణం
జరుగుమల్లి పోలీస్ స్టేషన్ వద్ద
దళిత సంఘాల ధర్నా


