
తిరస్కారమే పరిష్కారమా?
పొగాకుకు మద్దతు ధర ఇవ్వాలని రైతులు.. మాటలతో మభ్యపెడుతున్న పాలకులు
పొదిలి:
పొగాకు రైతులతో వ్యాపారులు బంతాట ఆడుతుండగా రాష్ట్ర ప్రభుత్వం గుడ్లప్పగించి చోద్యం చూస్తోంది. మద్దతు ధర కల్పిస్తామని మాయమాటలు చెబుతూ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కాలం వెళ్లబుచ్చుతున్నారే కానీ.. వ్యాపారులు, రైతులకు మధ్యేమార్గంగా వ్యవహరించి ఓ నిర్ణయం తీసుకోకుండా జాగు చేస్తున్నారు. ప్రస్తుతం పొగాకు వేలం కేంద్రాల్లో పరిమాణాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తొలుత ఆశాజనకంగా ప్రారంభమైన పొగాకు వేలం ప్రక్రియ రోజుల వ్యవధిలోనే రైతుల ఆశలను అడియాసలు చేసింది. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను దించడంతో ఏమి చేయాలో దిక్కుతోచక రైతులు సతమతం అవుతున్నారు. వేలానికి ఉంచిన బేళ్లు భారీగా తిరస్కరణకు గురవుతుండటం, మరో వైపు మద్దతు ధర లేకపోవడంతో పొగాకు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
పొదిలిలో పొగాకు వేలం తీరు రైతుల ఆందోళనను రోజురోజుకూ పెంచుతోంది. ధరలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన ఒక వైపు, మరో వైపు రిటర్న్ బేళ్ల టెన్షన్ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మండుతున్న ఎండల్లో బేళ్లను వేలం కేంద్రానికి పదే పదే తీసుకురాలేక రైతులు వ్యయ ప్రయాసాలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే పొగాకు బేళ్ల తూకంతోపాటు నాణ్యత తగ్గిపోతుండటంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొదిలి వేలం కేంద్రానికి ఈ నెల 22వ తేదీ వరకు 36,586 బేళ్లను తీసుకురాగా 25,886 బేళ్లు కొనుగోలయ్యాయి. గత బుధవారం ఒక్క రోజే 829 బేళ్లను రైతులు వేలంలో ఉంచగా 310 బేళ్లు తిరస్కరణకు గురయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. రిటర్న్ బేళ్లను స్థానికంగా నిల్వ చేసే అవకాశం లేక, తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక రైతులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీకావు. కొంత మంది రైతులు మాత్రమే ఒక్కో బేల్‌కు రోజుకు రూ.10 చొప్పున అద్దె చెల్లిస్తూ వేలం కేంద్రం సమీపంలో నిల్వ చేసుకుంటున్నారు. మిగిలిన వారికి ఆ అవకాశం లేక బేళ్లను తీసుకుని ఇంటి బాట పడుతున్నారు.
తిరస్కరించినవి 25 శాతం
పొదిలి వేలం కేంద్రానికి ఇప్పటి వరకు వచ్చిన మొత్తం బేళ్లలో సుమారు 25 శాతం తిరష్కరణకు గురయ్యాయి. వ్యాపారులు ఎఫ్ 1, ఎఫ్ 2 రకాల కొనుగోళ్లకు మొగ్గు చూపుతుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. సుమారు 30 శాతం మేర ఈ రెండు రకాలే ఉండటంతో మిగిలిన బేళ్ల పరిిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు.
రైతులపై రూ.50 లక్షల అదనపు భారం
వివిధ కారణాలతో తిరస్కరణకు గురైన బేళ్లను రైతులు ఇంటికి తీసుకెళ్లి మళ్లీ వేలం కేంద్రానికి తీసుకురావాలంటే సగటున రూ.500 వరకు ఖర్చు అవుతోంది. ఈ లెక్కన రైతులు ఇప్పటి వరకు సుమారు రూ.50 లక్షల మేర అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. మున్ముందు ఈ అదనపు వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది. రిటర్న్ బేళ్లను మళ్లీ వేలంలో ఉంచినా నాణ్యతకు తగిన ధర ఇచ్చి కొనుగోలు చేస్తారనే నమ్మకం రైతుల్లో సన్నగిల్లిపోతోంది.
పొదిలి కేంద్రంలో వేలానికి ఉంచిన బేళ్లు 36,586
వ్యాపారుల తిరస్కరణకు గురైనవి 10,031
మండుతున్న ఎండలతో తగ్గుతున్న బేళ్ల తూకం, నాణ్యత
రిటర్న్ బేళ్లను తిరిగి వేలానికి
తేవాలంటే అధిక భారం
పొదిలి వేలం కేంద్రంలో
రిటర్న్ బేళ్ల వివరాలు ఇలా..
(నోట్ : ఈ నెల 22వ తేదీ వరకు)
మొత్తం వేలానికి
ఉంచిన బేళ్లు 36,586
కొనుగోలు చేసినవి 25,886
రిటన్ బేళ్లు 10,031
నో సేల్ 1,56
నో బిడ్ 7,127
రైతు రిజక్షన్ 1,022
కంపెనీ రిజెక్షన్ 1,712
బీఆర్ 14
జంపింగ్ బేళ్లు 669