
పొగాకు రైతుకు అండగా వైఎస్సార్ సీపీ
ఒంగోలు సిటీ:
పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 28వ తేదీ పొదిలి వేలం కేంద్రానికి రానున్నారని వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఒంగోలు నగరంలో పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకర్లతో వారు మాట్లాడారు. మాయమాటలతో, అబద్ధాలతో రైతులను చిన్నచూపు చూడటం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటేనని కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయాన్ని పండుగ చేస్తే.. వ్యవసాయం దండగ అన్న రీతిలో చంద్రబాబు పాలన ఉంటోందని విమర్శించారు. గతేడాది పొగాకు క్వింటా రూ.36,000కు కొనుగోలు జరిగితే.. నేడు రూ.24,000కు కూడా కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. రానున్న రోజుల్లో ధరలు ఇంకా తగ్గే ప్రమాదముందన్నారు. రైతులకు మేలు చేయాలని టుబాకో బోర్డుకు, రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయమన్నారు. టుబాకోను మేము పట్టించుకోమని వ్యవసాయ శాఖామంత్రి అంటుంటే.. అసలు ఈ ప్రభుత్వం ఉన్నట్టా.. లేనట్టా అని కారుమూరి మండిపడ్డారు. రాష్ట్రానికి వెన్నెముకలాంటి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. దళారీలకు కొమ్ముకాస్తోందని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఈ క్రాప్ చేయించి ప్రభుత్వమే బీమా చేయించి రైతులను సకాలంలో ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. పంట నష్టం జరిగితే వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారని చెప్పారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు పక్షపాతిగా నిలిచారన్నారు. మద్దతు ధర లభించక రైతాంగం కుదేలవుతున్నా నేటి ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదని విమర్ళించారు. కందిపప్పు, పెసర పప్పు, మినప్పప్పు.. ఏదైనా సరే బహిరంగ మార్కెట్లో అధిక ధరలు ఉన్నాయని, రైతుకు మాత్రం గిట్టుబాటు ధర రావడం లేదని అన్నారు. దళారులు రైతు కష్టాన్ని దోచేస్తుంటే కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కారుమూరి మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతులకు డబ్బులిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రగల్భాలు పలికారని, మే 6వ తేదీ కొనుగోలు చేస్తే నేడు 22వ తేదీ అయినా రైతుకు డబ్బులివ్వలేదని ఆరోపించారు. పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు మాత్రం అండగా ఉంటోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులను పట్టించుకోడని ఆరోపించారు. రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 28వ తేదీ పొదిలిలో వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
రైతు బంధు.. వైఎస్ జగన్ :
ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
గతంలో పొగాకు రైతులు గిట్టుబాటు ధర లభించక అవస్థపడుతుంటే రూ.100 కోట్లు కేటాయించి మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి ఆదుకున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి గుర్తుచేశారు. నాడు క్వింటా రూ.34,000 నుంచి రూ.35,000 మధ్య కొనుగోలు చేయడంతో పొగాకు రైతులు బాగుపడ్డారని తెలిపారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని జగన్ నమ్మారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులను పట్టించుకున్న దాఖలాలు కనిపించడంలేదని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుగానీ, కూటమి నాయకులుగానీ రైతులకు భరోసా ఇవ్వడంలేదని మండిపడ్డారు. పొగాకు అమ్మకాలు జరుగుతున్న పలు వేలం కేంద్రాలను పరిశీలించానని, ప్రస్తుతం ఒక క్వింటా రూ.24,000కు కూడా కొనే పరిస్థితి లేదని అన్నారు. లో గ్రేడ్ అయితే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదన్నారు. వేలం కేంద్రాల వద్ద పొగాకు కొనుగోలు చేయకపోతే దానిని తిరిగి వెనక్కి తీసుకెళ్తున్నారని, ఫలితంగా రైతుపై ఎకరాకు రూ.50 వేలకుపైగా, బ్యారన్‌పై రూ.3.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ భారం పడుతోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో పొగాకు పండించిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ మేరుగు నాగార్జున, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబు, కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ దద్దాల నారాయణయాదవ్, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, వైఎస్సార్ సీపీ నాయకులు ఉడుముల శ్రీనివాసరెడ్డి, అన్నా కృష్ణచైతన్య, రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకటేశ్వరరావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, హనుమంతునిపాడు ఎంపీపీ గాయం సావిత్రి, మారెడ్డి సుబ్బారెడ్డి, మీరావలి, తదితరులు పాల్గొన్నారు.
28న పొదిలి రానున్న పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత ప్రభుత్వంలో మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు రైతుకు అండగా నిలిచిన జగన్ ప్రస్తుతం మద్దతు ధర లభించక కుదేలవుతున్న అన్నదాతలు దళారులకు వత్తాసు పలుకుతున్న కూటమి ప్రభుత్వం వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి