
పలు కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
సంతనూతలపాడు: మండలంలోని ఎండ్లూరు డొంక వద్ద గల జిల్లా మహిళా ప్రాంగణంలో త్వరలో బ్యూటీషియన్, మగ్గం వర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడర్, ఫ్యాబ్రిక్ కట్టర్ కోర్సుల్లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు మహిళా ప్రాంగణ జిల్లా మేనేజర్ వై.అంజమ్మ తెలిపారు. ఆధార్ కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో మహిళా ప్రాంగణ కార్యాలయానికి వచ్చి 18 నుంచి 45 సంవత్సరాల్లోపు మహిళలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రెండుమూడు నెలల పాటు శిక్షణ ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు 83339 21346 మొబైల్ నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
ప్రతి అర్జీపై శ్రద్ధ పెట్టాలి
● ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు సబర్బన్: ప్రతి ఒక్క అర్జీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరించాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణతో కలిసి ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అర్జీలను ఆయా శాఖల అధికారులకు బదిలీ చేస్తూ సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. మీ కోసం కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. వాటికి అర్ధవంతమైన సమాధానమిస్తూ పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అర్జీలను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్ ఉండరాదని అధికారులకు స్పష్టం చేశారు. అధికారులు ప్రతిరోజూ లాగిన్ అయి ఆన్‌లైన్‌లో వచ్చిన వినతులను చూడాలని, రీ ఓపెన్ కేసులు రాకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. డీఆర్‌ఓ బి.చినఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కుమార్, శ్రీధర్, వరకుమార్, డిప్యూటీ కలెక్టర్ పార్ధసారధి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీలో జిల్లా నాయకులకు పదవులు
ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన నాయకులను వివిధ హోదాల్లో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. దివ్యాంగుల విభాగం రాష్ట్ర సెక్రటరీగా సంతనూతలపాడు నియోజకవర్గానికి చెందిన కాట్రగడ్డ శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీగా దర్శి నియోజకవర్గానికి చెందిన దగ్గుల బ్రహ్మానందరెడ్డిని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.
జోరువానలోనూ
సీహెచ్‌ఓల పోరు
ఒంగోలు టౌన్: పదోన్నతులు, క్రమబద్దీకరణ, పీఎఫ్ పునరుద్ధరణ తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేపట్టిన సమ్మె సోమవారంతో 21వ రోజుకు చేరింది. సోమవారం భారీ వర్షంలోనూ సీహెచ్‌ఓలు దీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా ఏపీఎంసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మందగిరి రాజేష్ మాట్లాడుతూ.. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. సీహెచ్‌ఓల సమస్యలు పరిష్కరించడం వల్ల ప్రభుత్వం మీద ఎలాంటి ఆర్థిక భారం పడదని చెప్పారు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, పెరిగిన నిత్యావసరాల వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకొని వేతనం పెంచాలని కోరారు. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న సీహెచ్‌ఓల్లో 85 శాతం మహిళలు ఉన్నారని, ఆడబిడ్డల మొహం చూసైనా న్యాయం చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా నాయకులు శ్రీకాంత్, శైలజ, కామేష్, ఖాదర్ వలి, బాబురావు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

పలు కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం