
యోగాతో ఆరోగ్యకరమైన జీవితం
ఒంగోలు సిటీ: దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ యోగా సాధన చేస్తే ఆరోగ్యకరమైన జీవితం సాకారమవుతుందని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక ఏర్పాట్లలో భాగంగా బుధవారం ఉదయం ఒంగోలులోని కేంద్రియ విద్యాలయంలో నిర్వహించిన మెగా యోగా సాధనలో కలెక్టర్‌తోపాటు ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్, ఒంగోలు మేయర్ సుజాత, ఏపీ పర్యటకాభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జూన్ 21వ తేదీన నిర్వహించనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖకు వస్తున్న సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ యోగేంద్ర కార్యక్రమాన్ని నెల రోజులపాటు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పాఠశాలలు, కళాశాలల్లో యోగా సాధనపై అవగాహన కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ.. రానున్న నెల రోజులపాటు ప్రణాళిక ప్రకారం జిల్లాలోని ప్రతి గ్రామంలో యోగా సాధన చేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా యోగా గురువు పతంజలి బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విద్యార్థులు, యోగా సాధకులు, జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఆయుష్ శాఖ ఆర్డీడీ పద్మజాతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ తమీమ్ అన్సారియా