
ఆటో బోల్తా.. యువకుడు మృతి
● మరో ఇద్దరికి స్వల్ప గాయాలు
సింగరాయకొండ: ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడటంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం ఉదయం పాకల శివాలయం సమీపంలోని కోనేరు వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పాకల పల్లెపాలేనికి చెందిన స్నేహితులు రేవు రాజేష్(21), కొక్కిలిగడ్డ కిరణ్, సైకం సంతోష్ ఆటోలో వెళ్తున్నారు. ఆటో శివాలయం సమీపంలోని కోనేరు వద్దకు రాగానే అదుపుతప్పి ప్రమాదవశాత్తు తిరగబడింది. ప్రమాదంలో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ఇద్దరికి స్వల్ప గాయాలు కావడంతో సింగరాయకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. మృతుడు రాజేష్ పాలిటెక్నిక్ చదువుతున్నాడు. చేతికందివచ్చిన ఒక్కగానొక్క కుమారుడిని మృత్యువు కబళించడంతో తల్లిదండ్రులు రేవు నాగేంద్రం, కృష్ణమ్మలు బోరున విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.