
పశ్చిమాన మోస్తరు వర్షం
ఖరీఫ్ సాగుకు సన్నద్ధం
గత ఐదు రోజులుగా జిల్లాలో చెదురు ముదురు జల్లులతోపాటు భారీ వర్షాలు కురవడంతో పదునెక్కిన పొలాల్లో రైతులు సేద్యాలు ప్రారంభించారు. మార్కాపురం మండలంలోని వేములకోట, దరిమడుగు, గజ్జలకొండ, రాయవరం, నాయుడుపల్లి, మన్నెంవారిపల్లి, బోడపాడు పెద్దనాగులవరం, జమ్మనపల్లి, కోలభీమునిపాడు, చింతగుంట్ల, తిప్పాయపాలెం, ఎల్‌బీయస్ నగర్ తదితర గ్రామాల్లో వేసవి దక్కులు ప్రారంభమయ్యాయి. నైరుతి రుతుపవనాలు కూడా ముందుగానే వస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో సాగుకు సిద్ధమవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. తొలకరి వర్షాలు పడిన వెంటనే సజ్జ, కంది, ఆముదం, వేసవి పత్తి సాగు చేసేందుకు రైతులు సమాయత్తం అవుతున్నారు.
మార్కాపురం/పెద్దదోర్నాల/కనిగిరి: పశ్చిమ ప్రకాశంలోని పలు మండలాల్లో బుధవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దోర్నాల మండలంలో 10.2 మి.మీ, గిద్దలూరు 4.2 మి.మీ, పొదిలి 3.6 మి.మీ, రాచర్ల 3.6 మి.మీ, దొనకొండ 3.4 మి.మీ, కొనకనమిట్ల 3.0 మి.మీ, కంభం మండలంలో 2.6 మి.మీ వర్షపాతం నమోదైంది. మార్కాపురం, త్రిపురాంతకం, తర్లుపాడు, అర్ధవీడు, పుల్లలచెరువు, యర్రగొండపాలెం తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.
పొంగిపొర్లిన తీగలేరు
పెద్దదోర్నాల మండల కేంద్రంలో బుధవారం కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. లోతట్టు వీధులు జలమయంగా మారాయి. వర్ష ప్రభావంలో శ్రీశైలం రోడ్డులోని అయ్యప్పస్వామి ఆలయ పరిసర ప్రాంతాలు నీటి మడుగులను తలపించాయి. చిన్నదోర్నాల వద్ద తీగలేరు పొంగిపొర్లడంతో మార్కాపురం–దోర్నాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కనిగిరిలో జోరువాన
కనిగిరి ప్రాంతంలో బుధవారం రాత్రి 8 గంటల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కనిగిరి ప్రధాన వీధుల్లో డ్రెయినేజీలు పొంగిపొర్లడంతో అస్తవ్యస్తంగా మారాయి. ఈదురుగాలుల ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
చిన్నదోర్నాల వద్ద పొంగిపొర్లిన తీగలేరు వాహనాల రాకపోకలకు అంతరాయం కనిగిరిలో ఉరుములు, మెరుపులతో వాన ఈదురుగాలుల ధాటికి నిలిచిన విద్యుత్ సరఫరా ఖరీఫ్ సాగుకు సేద్యాలు ప్రారంభించిన రైతులు

పశ్చిమాన మోస్తరు వర్షం

పశ్చిమాన మోస్తరు వర్షం