
రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించండి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు సబర్బన్: రెవెన్యూ సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీల పరిష్కారంపై లోతుగా సమీక్షించారు. జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు భూసేకరణ, భూ అప్పగించి, రీ సర్వే, రెవెన్యూ సర్వీసులు, వాటర్ టాక్స్ తదితర అంశాలపై రెవెన్యూ డివిజనల్ అధికారులు, నియోజకవర్గ ప్రత్యేకాధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తిచేసేలా మండలాల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అంశాలపై వచ్చే అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత తహసీల్దార్లతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో డివిజనల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమించుకునే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెవెన్యూ చట్టాలు, రెవెన్యూ అంశాలపై అధికారులు పూర్తి అవగాహనతో పనిచేయాలన్నారు. రెగ్యులరైజేషన్ స్కీం 2025 ప్రక్రియపై రెవెన్యూ డివిజనల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, అందుకనుగుణంగా ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. గ్రామ స్థాయిలో వాటర్ టాక్స్ వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇంటి స్థల పట్టాల కోసం వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. భూముల రీ సర్వేలో ఎలాంటి జాప్యం, నిర్లక్ష్యం వహించకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి నివేదికలు తయారు చేసి పంపాలన్నారు. సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఒంగోలు, కనిగిరి ఆర్డీఓలు లక్ష్మీప్రసన్న, వెంకట శివరామిరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, నియోజకవర్గ ప్రత్యేకాధికారులు వరకుమార్, సత్యనారాయణ, శ్రీధర్, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌస్‌బాషా, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాస్, వివిధ సెక్షన్స్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.