
హిందీ పరీక్షకు 215 మంది గైర్హాజరు
ఒంగోలు సిటీ: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షకు రెండో రోజు హిందీ పరీక్షకు 215 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 286 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 71 మంది మాత్రమే హాజరయ్యారు. అలాగే ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం జరిగాయి. ఇంటర్‌కు తెలుగు పరీక్షకు మొత్తం 1013 మంది విద్యార్థులకు గాను 838 హాజరు కాగా 175 మంది గైర్హజరయ్యారు. హిందీ పరీక్షకు 14 మందికి గాను ముగ్గురు గైర్హాజరయ్యారు. ఇంగ్లిష్ పరీక్షకు మొత్తం 653 మంది విద్యార్థులకు గాను 511 మంది హాజరుకాగా 142 మంది గైర్హజరయ్యారు. డీఈఓ కిరణ్‌కుమార్ 12 కేంద్రాలను పరిశీలించారు.
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ
● ప్రమాదంలో డ్రైవర్ మృతి
త్రిపురాంతకం: వేగంగా వెళ్తున్న లారీ రోడ్డు పక్కన ఇంట్లోకి దూసుకెళ్లడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం అనంతపురం–అమరావతి జాతీయ రహదారిపై మేడపి సమీపంలో చోటుచేసుకుంది. త్రిపురాంతకం మండలంలోని ముడివేముల గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ వెంకటనారాయణ.. వినుకొండ వైపు నుంచి యర్రగొండపాలెం వెళ్తున్న క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. లారీ అదుపు తప్పి పాత మిద్దెలోకి దూసుకెళ్లడంతో క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన వెంకటనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్‌ను రక్షించేందకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.
చేపల వేటకు వెళ్లి మృత్యు ఒడిలోకి..
● పొన్నలూరు చెరువులో పడి వ్యక్తి మృతి
పొన్నలూరు: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృత్యు ఒడికి చేరాడు. ఈ సంఘటన మంగళవారం పొన్నలూరు చెరువు వద్ద చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని పైరెడ్డిపాలెం గ్రామాకి చెందిన కొడవల్లూరి శేషయ్య(48)కు వివాహమై భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో పొన్నలూరు చెరువులో చేపలు పట్టడానికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడటంతో మృతి చెందారు. చెరువు దగ్గర ఉన్న శేషయ్య వద్దకు వెళ్లిన ఆయన బంధువు.. విగతజీవిగా నీటిలో తేలుతున్న మృతదేహాన్ని గమనించి గ్రామస్తులకు తెలియజేశాడు. దీంతో గ్రామస్తులు వచ్చి శేషయ్య మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. శేషయ్యకు మూర్చ వ్యాధి ఉండటం వల్ల చేపలు పట్టే సమయంలో చెరువులో పడి మృతి చెంది ఉంటాడని బంధువులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనూక్ తెలిపారు.