
కురిచేడు: ద్విచక్ర వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం కురిచేడు మండలంలోని వెంగాయపాలెం సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని ఆవులమంద గ్రామానికి చెందిన పల్లె డేవిడ్(40) తమ గ్రామంలోని చర్చికి విద్యుత్ దీపాలంకరణ చేస్తానని పని కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో కొన్ని విద్యుత్ సీరియల్ లైట్లు తక్కువ కావడంతో తన బైక్‌పై వినుకొండ వెళ్లి కొనుగోలు చేశారు. తిరుగు ప్రయాణంలో వెంగాయపాలెం సమీపంలోకి వచ్చేసరికి బైక్ అదుపు తప్పడంతో విద్యుత్ స్తంభాన్ని డీకొట్టాడు. డేవిడ్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అదే మార్గంలో వెళ్తున్న వారు సమాచారం ఇవ్వడంతో బంధువులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.శివ తెలిపారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆదివారం రాత్రి డేవిడ్ తన కుమార్తె మెచ్యూర్ ఫంక్షన్ నిర్వహించారని, మరునాడే ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.