
ఉపాధి పని కోసం 8 కి.మీ నడక..
రాచర్ల: అక్కడ ఉపాధి హామీ పనికి వెళ్లాలంటే 8 కిలోమీటర్లు వెళ్లాలి. పాలకవీడు పంచాయతీ అనుమలవీడు గ్రామానికి చెందిన 40 మంది కూలీలకు శీలంవెంకటరెడ్డిపల్లె గ్రామ సమీపంలో ఎత్తైన అటవీ ప్రాంతంలో ఉపాధి పనులు ఏర్పాటు చేశారు. సోమవారం కొంత మంది కూలీలు ఆటోల్లో వెళ్లగా, మరికొందరు 8 కి.మీ దూరాన్ని కాలినడకన వెళ్లారు. ఉదయం ఉపాధి కూలీలకు పనులు చేసే ప్రాంతాన్ని చూపించి మస్టర్‌లో పేర్లు నమోదు చేసి మళ్లీ పని ముగిసిన తరువాత మస్టర్‌వారీగా కూలీల ఫొటోలను అప్‌లోడ్ చేయడానికి సర్వర్ సక్రమంగా పనిచేయలేదు. దాదాపు 12 గంటల వరకూ సమయం పట్టడంతో కూలీలు తీవ్రమైన ఎండలకు నానా అవస్థలు పడ్డారు. ఎండలకు పనులు చేసి ఎత్తైన కొండలపై నుంచి దిగేందుకు వృద్ధులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండలంలోని అన్ని పంచాయతీల్లో గ్రామాల వారీగా ఉపాధి కూలీలకు పనులు చూపించి పనులు చేస్తుంటే పాలకవీడు పంచాయతీలో మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతోందని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఎండతీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎత్తైన కొండ ప్రాంతాల్లో కాకుండా పనులు ఏర్పాటు చేయాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు.