
సూర్య ఘర్ అమలు వేగవంతం చేయాలి
● అధికారులతో సమీక్షించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు సబర్బన్:
జిల్లాలో పీఎం సూర్య ఘర్ అమలును వేగవంతం చేయాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. జిల్లాలో పీఎం సూర్య ఘర్ పథకం అమలు, పురోగతిపై స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో శనివారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోజువారీగా పురోగతి సాధించాలని ఆదేశించారు. జిల్లాలో పీఎం సూర్య ఘర్ పథకం కింద ఇప్పటివరకు 78,766 దరఖాస్తులు రాగా, అందులో 1,115 దరఖాస్తులు గ్రౌండింగ్ జరిగాయన్నారు. 736 మందికి సబ్సిడీ జమైందన్నారు. నియోజకవర్గానికి 10 వేల మంది లబ్ధిదారులుగా లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందని, అందుకనుగుణంగా మండలాలు, గ్రామాల వారీగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో తూర్పునాయుడుపాలెం, శంఖవరం, నాగంబొట్లపాలెం, సింగరాయకొండ, బేస్తవారిపేట గ్రామాలను ప్రత్యేక గ్రామాలుగా ఎంపిక చేసి 5 గ్రామాల్లో సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు చేపట్టిన చర్యలు, సాధించిన పురోగతిపై సమీక్షించారు. ఎక్కడైనా సబ్సిడీ రిలీజ్ చేయడంలో సమస్యలుంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. క్షేత్ర స్థాయిలో అన్నివర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి అన్ని గ్రామాల్లోనూ సౌర విద్యుత్ వినియోగం పెరిగేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సౌర విద్యుత్ వినియోగం వలన కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను ప్రజలకు వివరించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. వెండర్స్ వారీగా రిపోర్ట్ అందించాలని, వెండర్స్ అందరూ వారికి కేటాయించిన లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించారు. ఈ పథకం అమలులో ప్రతిరోజూ పురోగతి రావాలని, రోజువారీగా సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో ఏపీసీపీడీసీఎల్ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డీఆర్‌డీఏ పీడీ నారాయణ, ఎల్‌డీఎం రమేష్, సోలార్ విద్యుత్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.