
పొగాకు రైతుల పరిస్థితి దారుణం
పొదిలి రూరల్: కూటమి ప్రభుత్వంలో పొగాకు రైతుల పరిస్థితి దారుణంగా ఉందని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంటు పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. పొగాకు కొనుగోళ్లను పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా రైతులు పండించిన పంటలు కొనే దిక్కులేదన్నారు. రాష్ట్రంలో పొగాకు పండించే రైతుల పరిస్థితి చూస్తే మరీ దారుణంగా ఉందన్నారు. టుబాకో బోర్డు వారు 18 మిలియన్ల పొగాకుకు అనుమతిచ్చి, అందులో కేవలం 20 శాతం.. అంటే 3 వేల మిలియన్లు మాత్రమే కొనుగోలు చేశారన్నారు.
అది కూడా బీ గ్రేడ్ అనే దానికి గతంలో రూ.28 వేల నుంచి రూ.38 వేల మార్కెట్ వరకు జరిగితే.. ఇప్పుడు రూ.18 వేల నుంచి రూ.23 వేల వరకు ఇస్తున్నారన్నారు. రైతులు సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ పొగాకుకు ధర దక్కదని తగలబెడుతున్నారన్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడంతో పొగాకు రైతులు లాభాలు పొందారని చెప్పారు. ఎకరాకు రూ.3 లక్షల లాభం వచ్చిందని, ఇప్పుడు ఎకరాకు లక్ష నుంచి లక్షన్నర నష్టం వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని బత్తుల తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పొగాకును గ్రేడ్‌లుగా విభజించి రైతులను దివాళా తీయిస్తున్నారన్నారు. రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించేంత వరకు వారికి అండగా నిలిచి వైఎస్సార్ సీపీ పోరాడుతుందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఈ నెల 28వ తేదీ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పొదిలి రానున్న సందర్భంగా హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు కేవీ రమణారెడ్డి, సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, గొలమారి చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంటు పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి