
పచ్చనేతల తెగింపు.. తహసీల్దార్ బరితెగింపు..!
మర్రిపూడి: టీడీపీ నేతల భూ దాహం, రెవెన్యూ అధికారుల ధన దాహానికి ఆదివారం మర్రిపూడి తహసీల్దార్ కార్యాలయం తలుపులు తెరుచుకున్నాయి. పనిదినాల్లోనే కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చి అరకొరగా పనిచేసి వెళ్లిపోయే తహసీల్దార్ జ్వాల నరసింహారావు ఒక వీఆర్‌ఓ, మరొక ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్‌ను దగ్గర పెట్టుకుని భూముల ఆన్‌లైన్ పనులను బిజీబిజీగా చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయ తలుపులు మూసివేసి మరీ ఆదివారం గుట్టుచప్పుడు కాకుండా భూముల ఆన్‌లైన్ నమోదు పనులు చేపట్టారు. మర్రిపూడి పరిసరాలలోని పశువుల మేత భూమిని టీడీపీ నాయకుల పేర్లపై ఆన్‌లైన్ చేస్తున్నట్లు తెలుసుకున్న గ్రామస్తులు నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్‌ను నిలదీశారు. ఎవరి పేరుతో అయితే ఆన్‌లైన్ చేస్తున్నారో.. వారు హక్కుదారులు కాదని, నకిలీ పత్రాలు సృష్టించిన వ్యక్తులకు ఆన్‌లైన్ చేయడం తగదని అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన తమకు అన్యాయం చేయవద్దంటూ వేడుకున్నారు. 60 ఏళ్లుగా తమ స్వాధీనంలో ఉన్న భూములను కాసులకు కక్కుర్తిపడి మరొకరికి ఆన్‌లైన్ చేయవద్దని అధికారులను కోరారు. తెలుగు తమ్ముళ్ల కనుసన్నల్లోనే అధికారులు ఈ తంతు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు.
ఇదీ అసలు కథ...
మండల కేంద్రమైన మర్రిపూడిలో శ్రీపృధులగిరి లక్ష్మీనృసింహస్వామి కొండ సమీపంలో సర్వే నంబర్ 990–1లో 327.27 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని వెంకటగిరి రాజావారు తన హయాంలో పలు గ్రామాల వారు ఉమ్మడిగా పశువులు మేపుకునేందుకు వదిలారు. విపత్కర పరిస్థితులు ఎదురుకాకుండా ఉండేందుకు పలు గ్రామాలకు చెందిన 57 మంది పేర్లతో అప్పటి రెవెన్యూ అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు. ఈ క్రమంలో 57 మంది వంశీకుల వారసులు కొందరు ఆ భూమిని ఒకరికి తెలియకుండా మరొకరికి అమ్ముకున్నారు. గత టీడీపీ హయాంలో రిజిస్ట్రేషన్‌లు కూడా చేశారు. దీంతో అప్పటి జిల్లా కలెక్టర్ ఆ భూమి అక్రమ రిజిస్ట్రేషన్లపై ఉక్కుపాదం మోపి బ్లాక్‌లిస్టులో పెట్టారు. ప్రస్తుతం మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ నేతలు మరోసారి భూ అక్రమాలకు తెరలేపారు. ఆ భూమిని కొందరు హక్కుదారులు సాగుచేసుకుంటుండగా, మరికొంతమంది రైతులు అలాగే వదిలేశారు. మండలంలోని గుండ్లసముద్రం, రేగలగడ్డ, మర్రిపూడి, గంగపాలెం, పొట్టిరెడ్డిపాలెం తదితర గ్రామాలకు చెందిన వారు పశువులు మేపుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పశువుల బీడుపై కన్నుపడింది. తెలుగు తమ్ముళ్ల ఒత్తిడితో పాటు కాసులకు కక్కుర్తిపడిన స్థానిక తహసీల్దార్.. ఆదివారం బీడు భూమిని అక్రమార్కుల పేరుతో ఆన్‌లైన్ పనులు చేపట్టారు. పమిడి రమేష్‌బాబు పేరుతో సర్వే నంబర్ 990–1సీ20లో 17.10 ఎకరాలు, నల్లూరి శ్రీనివాసరావు పేరుతో సర్వే నంబర్ 990–1సీ24లో 11.40 ఎకరాలు, నేరెళ్ల ఏడుకొండలు పేరుతో 990–1సీ4ఏలో 2.85 ఎకరాలు, 990–1సీ4ఏలో 2.85 ఎకరాలును ఆన్‌లైన్ చేశారు. విషయం తెలుసుకున్న ఆ భూమి వారసులైన గొంటు హనుమాయమ్మ, గొంటు వెంకట నర్శింహారెడ్డి, సూరే రమణారెడ్డి, మరి కొంతమంది భూహక్కుదారులు వెళ్లి తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఆన్‌లైన్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎఫ్‌ఎల్‌ఆర్‌లో ఉన్న పేర్లకు నకిలీ వారసులను సృష్టించి వారితో రిజిస్ట్రేషన్ చేయించుకుని పాస్‌పుస్తకాలు మంజూరు చేయడం ఏమిటని మూకుమ్మడిగా తహసీల్దార్‌ను నిలదీశారు. ఆధారాలను పరిశీలించి ముందుగా తమకు ఆన్‌లైన్ చేయాలన్నారు. అసలైన వారసులను మీరు ఎలా గుర్తించారో.. మా పొలానికి వారు వారసులు ఎలా అవుతారో చెప్పాలని నిలదీశారు. తమకు అన్యాయం చేయవద్దని వేడుకున్నారు. దీంతో కంగుతిన్న తహసీల్దార్.. ఆధారాలు తీసుకువస్తే పరిశీలిస్తానని చెప్పారు. అయితే, సంబంధిత ఆధారాలను ఇప్పటికే మూడు సార్లు రెవెన్యూ కార్యాలయంలో అధికారులకు అందజేశామని రైతులు తెలిపారు. దీంతో ఏం చేయాలో అర్థంగాక తహసీల్దార్ వెళ్లిపోయారు.
పశువుల మేత భూములు కాజేసేందుకు చక్రం తిప్పిన టీడీపీ నేతలు ఆదివారం కార్యాలయ తలుపులు వేసుకుని మరీ ఆన్‌లైన్ చేస్తున్న తహసీల్దార్, సిబ్బంది గతంలో కలెక్టర్ హోల్డ్‌లో పెట్టినప్పటికీ.. నిబంధనలకు తూట్లు కాసులకు కక్కుర్తిపడి గుట్టుచప్పుడు కాకుండా ఆన్‌లైన్ పనులు విషయం తెలుసుకుని వెళ్లి నిలదీసిన గ్రామస్తులు తమకు అన్యాయం చేయవద్దంటూ తహసీల్దార్‌తో గగ్గోలు

పచ్చనేతల తెగింపు.. తహసీల్దార్ బరితెగింపు..!