
కూటమి పొగ!
కొరగాని ధర..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పొగాకు వేలం కేంద్రాల్లో ఈ ఏడాది ఆరంభ ధరలు చూసి రైతు సంబరపడ్డాడు. గతేడాదిలాగే ఈసారి కూడా లాభాలు మూటగట్టుకోవచ్చని ఆశపడ్డాడు. అయితే, తాజా పరిస్థితులు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. నాలుగేళ్లు లాభాలు చూసిన రైతు నేడు నష్టాల ఊబిలో కూరుకుపోయే దుస్థితి నెలకొంది. ప్రకాశం రీజియన్ పరిధిలోని 11 వేలం కేంద్రాల్లో సుమారు 30 వేల మంది రైతులు పొగాకు సాగుచేస్తున్నారు. పొగాకు బోర్డు ఈ ఏడాది 68,500 హెక్టార్లలో సాగుకు అనుమతివ్వగా పరిమితికి మించి 88 వేల హెక్టార్లలో సాగుచేశారు. బోర్డు అనుమతిచ్చిన పంట ఉత్పత్తి పరిమాణం సుమారు 105.27 మిలియన్ కిలోలు ఉండగా, పంట ఉత్పత్తి అంచనా సుమారు 162 మిలియన్ కిలోలుగా నిర్ణయించారు. రీజియన్ పరిధిలో మార్చి 10వ తేదీ పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. తొలి రోజు కిలో ధర అత్యధికంగా రూ.280, అత్యల్పంగా రూ.278 పలికింది. రానున్న రోజుల్లో మంచి ధరలు పలికి ఈసారి ఖర్చులు పెరిగినా గట్టెక్కొచ్చని భావించారు. కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయన్న తరుణంలో పరిస్థితి తలకిందులైంది. ధరలు తగ్గిపోవడం, వేలం కేంద్రాలకు వస్తున్న పొగాకు బ్యారన్లలో 40 శాతం వెనక్కిపోతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దళారులు, బయ్యర్లు కుమ్మక్కయ్యారు. నాణ్యత పేరుతో దొంగాట మొదలెట్టారు. వేలం కేంద్రాలకు వచ్చిన వాటిలో 10 శాతం బేళ్లకు మాత్రమే అత్యధిక రేటు.. అంటే రూ.280 చెల్లిస్తూ మిగతా వాటిని వారికిష్టమొచ్చిన రేటుకు తీసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా బోర్టు అధికారులు పట్టించుకోవడం మానేశారు. దీంతో తెచ్చిన సరుకును వెనక్కి తీసుకెళ్లలేక కొంత మంది రైతులు వచ్చిన రేటుకే తెగనమ్ముకుంటున్నారు. మరికొంత మంది ఆర్థిక భారమైనా కోల్డ్‌స్టోరేజీలకు తరలిస్తున్నారు. మమ్మల్ని ఆదుకోండి మహాప్రభో అని ప్రభుత్వ పెద్దలను కోరుతున్నా వేలం కేంద్రాల సందర్శన, ఆర్భాటపు ప్రకటనలు మినహా ఒరిగిందేమీ లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లు ప్రారంభమై దాదాపు 70 రోజులు గడుస్తున్నా ధరలు పుంజుకోకపోవడంతో రైతు పరిస్థితి మరింతగా దిగజారింది.
గతేడాది కేజీ గరిష్ట ధర రూ.366...
రీజియన్ పరిధిలో గతేడాది కేజీ పొగాకు గరిష్ట ధర రూ.366 పలకగా, ఈ ఏడాది వేలం మొదలై 65 రోజులు దాటుతున్నా ఇంత వరకు గరిష్ట ధర రూ.280కు మించలేదు. గత నాలుగేళ్లలో గరిష్ట ధరలను పరిశీలిస్తే 2020–21లో రూ.184, 2021–22లో రూ.199, 2022–23లో రూ.289, 2023–24లో రూ.366 పలకగా, ఈ ఏడాది.. అంటే 2024–25లో రూ.281 పలికింది. అది కూడా రెండుమూడు బేళ్లు తప్ప కొనుగోలు చేసిన బేళ్ల సరాసరి చూసుకుంటే ఈ ఏడాది రూ.255.35కు మాత్రమే పరిమితమైంది.
భారీగా పెరిగిన పెట్టుబడులు...
గత నాలుగేళ్లలో పొలాల కౌలు, పెట్టుబడి, బ్యారన్ అద్దెలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం దాదాపు 80 శాతానికిపైగా ఖర్చులు పెరిగాయి. గత నాలుగేళ్లలో ఒక్కో బ్యారన్ రైతు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు లాభాలు గడించారు. ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుతం పలుకుతున్న ధరలు చూసి రైతుల నోట మాట కూడా రావడం లేదు. ఒక్కో బ్యారన్‌కు సుమారు రూ.3 లక్షలకుపైగా నష్టాలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి ఖర్చులు పెరగడం, పొలాలు, బ్యారన్‌ల కౌలు, కూలీల ధరలు భారీగా పెరగడంతో సాగు వ్యయంలో సగానికి సగం కూడా రావడంలేదని వాపోతున్నారు. పొగాకు బేళ్లకు పలుకుతున్న ధరలే సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కేజీ పొగాకు గరిష్టంగా రూ.320 పలికితే రైతులు కొద్దోగొప్పో లాభాలతో బయటపడేవారు. కానీ, ప్రస్తుతం పలుకుతున్న ధరలు గరిష్టంగా రూ.260కు మించి పలకడం లేదు. ఎక్కడో ఒకటో రెండో బేళ్లకు మాత్రం రూ.280 పలుకుతోంది.
మార్క్‌ఫెడ్ ద్వారా రైతులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ సర్కార్...
నాలుగేళ్ల కిందట బయ్యర్ల నుంచి సరైన ప్రోత్సాహం లభించక గిట్టుబాటు ధరలు రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్న దశలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి అండగా నిలిచింది. రైతుల దగ్గర నుంచి పొగాకు కొనుగోలు చేసి గిట్టుబాటు ధరలు కల్పించడంతో కష్టాల నుంచి గట్టెక్కారు. మార్కెట్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పోటీతత్వం పెరగడంతో రైతులు లాభాల బాటపట్టారు. ఆనాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అండగా నిలిచిన విధానాన్ని ఇప్పుడు రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రైతులు తీవ్రంగా నష్టాలపాలవుతున్నా వారి గురించి ఆలోచించే మంత్రులే లేరని వాపోతున్నారు.
నాడు గుల్లాకుకూ మంచి రేటు...
గత నాలుగేళ్లలో రైతులు అనుమతికి మించి పొగాకు సాగుచేసినా.. బోర్డు అధికారులు బయ్యర్లతో కొనుగోలు చేయించారు. గతేడాది (2023–24) 88.69 మిలియన్ కేజీలు కొనుగోలు చేసేందుకు బోర్డు అనుమతిచ్చింది. అయితే, రైతుల నుంచి ఏకంగా 154.41 మిలియన్ కేజీలు కొనుగోలు చేసింది. రైతుల వద్ద చివరిగా మిగిలిన పండాకు, మాడు, పచ్చ, గుల్ల వంటి ఆకును సైతం మంచి ధరకు కొనుగోలు చేశారు.
నాలుగేళ్లుగా వచ్చిన పొగాకు ధరలు నేడు కనుమరుగు మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి రైతులకు అండగా నిలిచిన గత వైఎస్సార్ సీపీ సర్కార్ ప్రస్తుతం 40 శాతానికిపైగా పొగాకు బేళ్ల తిరస్కరణ బయ్యర్లు సిండికేట్ అయినా చోద్యం చూస్తున్న పొగాకు బోర్డు రైతుల కష్టాలు పట్టించుకోని కూటమి ప్రభుత్వం ఒక్కో బ్యారన్‌కు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల నష్టమంటూ రైతుల ఆందోళన గతేడాది గుల్లాకుకు వచ్చిన ధర నేడు గ్రేడ్–1 ఆకుకు రాని వైనం నష్టాల ఊబిలో కూరుకుపోతున్న పొగాకు రైతు
అమ్ముకోలేక, నిల్వ ఉంచలేక...
మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించాలి
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పొగాకు ధరలు తగ్గిపోవడంతో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహనరెడ్డి మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించారు. దీంతో వ్యాపారుల్లో పోటీ నెలకొని పొగాకు ధరలు పెంచి కొనుగోలు చేశారు. పొగాకు రైతులు లాభాలు పొందారు. గత నాలుగు సంవత్సరాలుగా వారికి ఎనలేని మేలు జరిగింది. రైతు కుటుంబాల్లో పిల్లల చదువులు, వివాహాలు, ఇతర ఖర్చులకు ఎటువంటి సమస్యా లేకుండా గడిచింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులను గాలికొదిలేసింది. దీంతో పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతులను ఆదుకోవాలి.
– వెన్నా రామిరెడ్డి, పొగాకు రైతు, గొట్లగట్టు
మార్కెట్ మాయాజాలంలో చిక్కుకుని పొగాకు రైతు దగాపడ్డాడు. నాలుగేళ్లుగా లాభాలు చవిచూసిన రైతు పరిస్థితి నేడు తిరగబడింది. గత ధరలను ప్రస్తుత ధరలతో పోల్చుకుంటూ రైతులు ఘొల్లుమంటున్నారు. గతేడాది ఆల్ టైమ్ గరిష్ట ధర రూ.366గా నమోదైంది. ఈ ఏడాది 65 రోజులు గడుస్తున్నా నాణ్యమైన పొగాకు ధర రూ.280 దాటడం లేదు. వ్యాపారులు, దళారులు కుమ్మక్కవడం, బోర్డు అధికారులు చోద్యం చూస్తుండటంతో కనీస గిట్టుబాటు ధరలు లభించక రైతులు విలవిల్లాడుతున్నాడు. వేలం కేంద్రాల్లో రైతుల నుంచి అరకొరగా కొనుగోలు చేయడం, తడిగా ఉందంటూ, నాణ్యత లేదంటూ సాకులు చెప్పి వెనక్కు పంపడం చేస్తున్నారు. వేలం కేంద్రాలకు వచ్చిన సరుకులో 40 శాతం వెనక్కి పంపిస్తుండడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
పెట్టిన పెట్టుబడి రాక, నష్టాలు భరించలేక, ప్రభుత్వం చేష్టలుడిగి చోద్యం చూస్తుండటంతో చేసేది లేక నాగులుప్పలపాడు, వెల్లంపల్లి, కొండపి ప్రాంతాల రైతులు వేలం కోసం తీసుకొచ్చిన బేళ్లను ఇంటికి తీసుకెళ్లలేక నడిరోడ్లుపై పడేసి ఆవేదనతో దహనం చేస్తున్నారు. ప్రభుత్వం ఏమాత్రం చేయూతనివ్వకపోవడంతో జగన్ సర్కార్ కాలంలో పొగాకు రైతులకు అందించిన ధరలను గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పుడొస్తున్న ధరలతో పోల్చుకుంటూ కుమిలిపోతున్నారు.

కూటమి పొగ!