
యోగాపై విస్తృతంగా అవగాహన కల్పించాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు సబర్బన్: యోగాంధ్ర–2025 మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలో 10 లక్షల మందికి యోగా సాధనపై అవగాహన కల్పించేలా జిల్లావ్యాప్తంగా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. ఒంగోలులోని ప్రకాశం భవనం ఎదురుగా శనివారం ఉదయం ఏర్పాటు చేసిన యోగా రోడ్డులో కలెక్టర్‌తో పాటు జేసీ ఆర్.గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, ఒంగోలు నగర మేయర్ జి.సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 21న విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో 5 లక్షల మంది ప్రజలు పాల్గొనే విధంగా ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా యోగా మాసం జరుపుకుంటున్నామన్నారు. అందులో భాగంగా జిల్లాలో 10 లక్షల మందికి యోగా సాధనపై అవగాహన కల్పించే కార్యక్రమానికి రూపకల్పన చేశామని కలెక్టర్ వివరించారు. రోజుకో కార్యక్రమంతో యోగాపై అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రధాన మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో ఒక రోడ్డును యోగా రోడ్డుగా ప్రకటించి ఆ రోడ్డులో ప్రతిరోజూ ఉదయం యోగాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ యోగా సాధన చేసేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతిఒక్కరూ యోగాను జీవన విధానంగా అలవర్చుకోవాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ శాఖ సిబ్బంది, యోగా సాధకులు పాల్గొన్నారు.
పాత భవనాల తొలగింపునకు 28న వేలం పాట
నాగులుప్పలపాడు: మండలంలోని అమ్మనబ్రోలు గ్రామంలో ఏపీ గురుకుల పాఠశాలలో శిథిలమైన భవనాలు తొలగించేందుకు ఈ నెల 28వ తేదీ వేలం పాట నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ కె.మాధవి తెలిపారు. ఆసక్తిగల వారు రూ.10 వేల ధరావత్తుతో పాటు రూ.3,540 ప్రవేశ రుసుంను డీడీ రూపంలో ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా పాఠశాలలో అందజేయాలని సూచించారు. అనంతరం ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు 87126 25043 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.