
జీవితాలు కూలిపోయి
ధర పడిపోయి..
పొదిలి:
పృధులాపురి రైతుల ధనాగారంగా ఉన్న పొగాకు నేడు పగాకుగా మారుతోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుందనే ఆశతో పొగాకు సాగుకు మొగ్గు చూపారు. తీవ్ర కరువుతో పంటలకు నీరందుతుందన్న నమ్మకం లేక రైతులు తక్కువ నీటితో సాగయ్యే పొగాకు వైపు ఆసక్తి చూపి సాగుచేశారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కరువు రైతుపై కోలుకోలేని దెబ్బ పడనుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ప్రభుత్వ సహకారం లోపించడం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పొగాకు రైతు కుదేలవుతున్నాడు. అధిక మొత్తంలో లో గ్రేడ్ ఉత్పత్తి కావడం, నాణ్యమైన పొగాకు ధర తగ్గుతుండటంతో లో గ్రేడ్ ధరలపై రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలం జరిగే తీరుపై రైతుల్లో అసహనం నెలకొంది. కేంద్రాలకు వస్తున్న అధిక బేళ్లను తిప్పి పంపించివేస్తుండడంతో రైతుపై అదనపు భారం పడుతోంది. ఈ పరిణామాలన్నీ రైతు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
మూడు నెలల పంట..
ఆరు నెలల అమ్మకాలు...
పొగాకు రైతులు నష్టపోయే మరొక సమస్య అమ్మకాలు. సకాలంలో అమ్మకాలు జరిగి డబ్బు చేతికొస్తే పెట్టుబడులకు చేసిన అప్పులు తీర్చుకుంటే వడ్డీలైనా మిగులుతాయి. మూడు నెలల పంట కాలం అయితే ఆరేడు నెలల పాటు అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో పెట్టుబడులకు వడ్డీలు పెరిగిపోవటంతో పాటు దీర్ఘకాలంగా నిల్వ ఉండడంతో పొగాకు నాణ్యత, బరువు తగ్గిపోతున్నాయి. సేద్యాలు చేసినందుకు, పచ్చాకు ముఠాలకు, క్యూరింగ్ కర్రకు, కూలీలకు అప్పులు తెచ్చారు. ఈ సంవత్సరం ఎప్పటికి పూర్తవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఇప్పటి వరకు సుమారు 2 మిలియన్ కిలోలు కూడా కొనుగోలు జరగలేదు.
గుబులు పుట్టిస్తున్న లో గ్రేడ్...
ఈ ఏడు వాతావరణం అనుకూలించకపోవటం, లేత ప్లాంటేషన్ల కారణంగా లో గ్రేడ్ ఉత్పత్తి ఎక్కువగా జరిగింది. సుమారు 65 శాతం మేర సగటున లో గ్రేడ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. సగటున లో గ్రేడ్‌కు రూ.230 ఉంటేనే రైతులు గట్టునపడే అవకాశం ఉంది. లేదంటే అప్పులు మిగిలే ప్రమాదం ఉంది. గ్రేడ్ పొగాకుకే ధరలు ఇచ్చేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవటంతో, అధిక శాతం ఉన్న లో గ్రేడ్ మార్కెట్ తలచుకుంటేనే గుబులు పుడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అండగా నిలవాల్సిన టుబాకో బోర్డు, పాలకులు రైతును గాలికొదిలేశారు. కంపెనీలు సిండికేట్‌గా మారి దోపిడీ చేస్తున్నా.. కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
జగన్ పాలనలో పొగాకు రైతుకు
స్వర్ణయుగం...
వైఎస్ జగన్‌మోహనరెడ్డి పాలనలో పొగాకు రైతుకు స్వర్ణయుగంగా ఉంది. రైతులు పండించిన పొగాకుకు గతంలో ఎన్నడూ లేనంతగా సగటు ధర వచ్చింది. కంపెనీల వారు తక్కువ ధరకు కొనుగోలు చేస్తుంటే, వెంటనే మార్క్‌ఫెడ్‌కు నిధులిచ్చి పొగాకు కొనుగోలు చేయించారు. దీంతో పలు కంపెనీల వారు చేసేదేమీ లేక పోటీ పడి అధిక ధరలకు పొగాకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో గత సంవత్సరం రూ.274.79 సగటు ధర వచ్చింది. ఈ ఏడు ప్రభుత్వం, బోర్డు పట్టించుకోకపోవడంతో రైతులకు నష్టాలు మిగిలి పొగాకు ధనాగారం వట్టిపోతుందనే ఆందోళన రైతాంగంలో ఉంది.
కరువు రైతుపై పొగాకు పోటు
గడిచిన ఐదేళ్లూ లాభాల పంటగా అమ్మకాలు గత సంవత్సరం సగటు ధర రూ.274.79 ప్రస్తుతం ధర తగ్గుతుండటంతో ఆందోళన రైతుల వద్ద భారీగా లోగ్రేడ్ పొగాకు నిల్వలు 2 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు
పొదిలి వేలం కేంద్రం పరిధిలోని వివరాలు ఇలా...
మొత్తం మండలాలు 13
మొత్తం బ్యారన్‌లు 2,602
మొత్తం రైతులు 4,390
అనుమతించిన విస్తీర్ణం 21,335 ఎకరాలు
పొగాకు సాగు విస్తీర్ణం 27,577
అమ్మకాలకు అనుమతి 11.10 మి.కిలోలు
ఉత్పత్తి అంచనా 18 మి.కిలోలు
ఇప్పటి వరకూ కొనుగోలు 2 మి.కిలోలు
నిన్నటి వరకూ కరువు మండలాల రైతుకు పొగాకు సాగు లాభాలు పండించింది.
నీటి వనరులు తక్కువగా ఉండడంతో ఏళ్లతరబడి సాగుచేస్తున్న సంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పి తక్కువ నీటితో సాగయ్యే పొగాకుపై రైతులు దృష్టి సారించారు. ఇటు రైతులతో పాటు రైతు కూలీలకు కూడా మంచి ఆదాయం లభిస్తుండటంతో రైతులు పొగాకు సాగుపై ఆసక్తి చూపించారు. ప్రస్తుతం ధరలు పడిపోవడంతో పరిస్థితి తలకిందులైంది.
దీనిని నమ్ముకున్న రైతులు రోడ్డున పడే పరిస్థితులు నెలకొన్నాయి.
సంవత్సరం సాగు విస్తీర్ణం అమ్మకాలు సగటు ధర
(ఎకరాలలో) (మిలియన్ కిలోలు) (రూపాయలు)
2019–20 19,305 9.35 104.50
2020–21 14,017 6.91 135.54
2021–22 12,432 6.76 167.16
2022–23 19,497 12.29 214.76
2023–24 20,532 13.00 274.79
ప్రతి సంవత్సరం సగటు ధర పెరుగుతుండటంతో రైతులకు లాభాలు వచ్చాయి.

జీవితాలు కూలిపోయి

జీవితాలు కూలిపోయి

జీవితాలు కూలిపోయి