
పొగాకు ధరలపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు
● వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు
నాగులుప్పలపాడు: రాష్ట్రంలో పొగాకు రైతులతో పాటు ఇతర పంటలు పండించిన రైతాంగానికి మద్దతు ధరలు కల్పించకుండా ప్రభుత్వం వివక్ష చూపుతోందని, అది తగదని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావుమాదిగ అన్నారు. జిల్లాలో గిట్టుబాటు ధరలకు పొగాకు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గుర్తించి వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 28వ తేదీ మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పొదిలిలో నేరుగా రైతులతో మాట్లాడనున్నట్లు తెలిపారు. పొగాకు రైతులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సోమవారం నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కనకారావు మాట్లాడారు. ఈ ఏడాది పొగాకు పంట సాగుచేసిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వారి జీవితంలో ఎన్నడూ ఎదుర్కోలేదన్నారు. గత ప్రభుత్వంలో పొగాకు కొనుగోలు చేసే కంపెనీలు సిండికేటై ఇలాగే రైతులను ఇబ్బందిపెట్టాలని చూసిన సందర్భంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల వద్ద ఉన్న పొగాకు కొనుగోలు చేయడంతో పాటు రూ.3,500 కోట్లతో రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారన్నారు. తద్వారా మిగతా పంటలకు కనీస మద్దతు ధర ఇప్పించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికి దక్కిందన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది కాలంగా రైతులు పడుతున్న తీవ్ర ఇబ్బందులు చూస్తూ కూడా గుడ్డిగా వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు. ఇప్పటికై నా ఈ ప్రభుత్వం కళ్లుతెరిచి రైతుల వద్ద ఉన్న పొగాకు పంటతో పాటు మిగతా పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు పొలినేని కోటేశ్వరరావు, రైతు విభాగం మండల అధ్యక్షుడు తగిరిస సుబ్బారావు, గ్రీవెన్సు సెల్ రాష్ట్ర కార్యదర్శి పేరాల చెన్నకేశవులు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జెట్టి శ్రీనివాసరావు, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు రేణు, పార్టీ నాయకులు గండు హరిబాబు, యడవల్లి మోహనరావు, రైతులు అక్కి సాంబశివరావు, నల్లూరి సుబ్బారావు, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.