● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు సిటీ: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. మార్కెట్లు, దుకాణాల వద్ద ఇందుకు అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించాలని చెప్పారు. బుధవారం అమరావతి సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకష్ణతో కలిసి తన క్యాంప్ కార్యాలయం నుంచి కలెక్టర్ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సమీక్ష అనంతరం అధికారులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా చర్చించారు. ప్రతి నెలా మూడో శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15వ తేదీన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని సమర్ధంగా నిషేధించాలనే ఇతివృత్తంతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈ దిశగా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేలా వివిధ స్థాయిల్లో ప్రజాప్రతినిధులను. ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను భాగస్వాములను చేయాలని చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించడంతోపాటు వాటికి ప్రత్యామ్నాయంగా క్లాత్, జ్యూట్ సంచులపై ప్రచారం చేయాలన్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉన్నందున శాఖల వారీగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలు–పురోగతి, జిల్లాల వారీగా ప్రత్యేక అంశాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లు తయారు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 17వ తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఉన్నందున ఆయా పరీక్ష కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతోపాటు భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పెన్షన్‌ల పంపిణీ, రెవెన్యూ మ్యుటేషన్లు కరెక్షన్లు, పారిశుధ్ధ్యం, ప్రతి రోజు చెత్త సేకరణ, ఆస్పత్రులు, దేవాలయాల్లో ప్రజలకు అందించే సేవల విషయంలో నిర్లక్ష్యం లేకుండా చూడాలన్నారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బాలశంకరరావు, సీపీఓ వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీఎంఅండ్ హెచ్‌ఓ వెంకటేశ్వర్లు, సూరిబాబు, డీపీవో వెంకట నాయుడు, డీఆర్‌డీఏ పీడీ నారాయణ, ఏపీడీ వండర్ మాన్, సర్వే శాఖ సహాయ సంచాలకులు గౌస్ బాష, విద్య, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.