ఆర్మీ ఉద్యోగి అదృశ్యం

- - Sakshi

ప్రకాశం: ఓ ఆర్మీ జవాన్‌ విధులకు హాజరయ్యేందుకు పశ్చిమ బెంగాల్‌కు వెళ్లి అక్కడ అదృశ్యమయ్యాడు. 10 రోజులు దాటినా ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కొమరోలు మండలలోని ఎర్రపల్లె గ్రామానికి చెందిన మారంరెడ్డి వీరబ్రహ్మానందరెడ్డి పదేళ్లుగా ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని న్యూజల్పాయ్‌గురి క్యాంప్‌లో ఉంటున్నాడు. కాగా, డిసెంబరు 8వ తేదీన వీరబ్రహ్మానందరెడ్డి సెలవుపై స్వగ్రామానికి వచ్చి నెల రోజుల తర్వాత తిరిగి జనవరి 8వ తేదీన విధుల్లో చేరేందుకు స్వగ్రామం నుంచి బయలుదేరి వెళ్లాడు.

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని ఎల్‌జీపీటీ రైల్వేస్టేషన్‌లో దిగిన వీరబ్రహ్మానందరెడ్డి అక్కడే అదృశ్యమయ్యాడు. జనవరి 10వ తేదీన కుటుంబ సభ్యులతో మాట్లాడిన వీరబ్రహ్మానందరెడ్డి ఎల్‌జీపీటీ రైల్వేస్టేషన్‌లో అదృశ్యం కావడంతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

బంధుమిత్రులు కూడా ఆ ప్రాంతానికి వెళ్లి వీరబ్రహ్మానందరెడ్డి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కలగజేసుకుని విచారణ చేపట్టాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరబ్రహ్మానందరెడ్డికి సంబంధించిన మొబైల్‌ ఫోన్‌, లగేజీ ఎల్‌జీపీటీ రైల్వేస్టేషన్‌లో రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరబ్రహ్మానందరెడ్డికి ఏడాది క్రితమే ఒంగోలుకు చెందిన భాగ్యలక్ష్మితో వివాహమైంది.

 

Read latest Prakasam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top