లింగసముద్రం: గేదెలు మేపేందుకు వెళ్లిన యువకుడు తేలు కాటుతో మృతి చెందాడు. ఈ సంఘటన లింగసముద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. లింగసముద్రం గ్రామానికి చెందిన గోగుల మహేంద్ర (9) స్థానిక ఎంపీయూపీ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాలకు సెలవు కావడంతో తన తండ్రి మల్లికార్జునతో కలిసి గేదెలు మేపేందుకు వెళ్లాడు. ఊరి చివర గేదెలు మేపుకుంటుండగా దగ్గరలో ఉన్న ఇంటి ప్రహరీపై కండువా ఉండడంతో మహేంద్ర ఆ కండువాను తలమీద వేసుకున్నాడు. కండువాలో ఉన్న తేలు మహేంద్ర తలకి కుట్టడంతో కేకలు వేశాడు. దగ్గరలో ఉన్న తండ్రి వచ్చి కండువాను పరిశీలించగా అందులో తేలు కనిపించింది. వెంటనే 108లో కందుకూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా ఆదివారం మధ్యాహ్నం మహేంద్ర మృతి చెందాడు. తేలు కాటుకు మహేంద్ర మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్
విజేత.. బాపట్ల
మార్టూరు: రాష్ట్రస్థాయి షూటింగ్‌బాల్ విజేతగా బాపట్ల జిల్లా నిలిచింది. గత రెండు రోజులుగా మార్టూరు వివేకానంద నెక్ట్స్‌జెన్ పాఠశాలలో నిర్వహిస్తున్న 42వ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలు ఆదివారం రాత్రితో ముగిశాయి. అండర్–19 బాలబాలికల విభాగంలో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. బాలుర విభాగంలో బాపట్ల, గుంటూరు, నెల్లూరు జిల్లాల క్రీడాకారులు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొందారు. బాలికల విభాగంలో గుంటూరు, శ్రీకాకుళం, అనకాపల్లి జట్లు విజేతలుగా నిలిచాయి. విజేతలకు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో షూటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా నాయకులు, వివేకానంద పాఠశాల డైరెక్టర్ వేలూరు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.