
మాట్లాడుతున్న భారతీయం సత్యవాణి
ఒంగోలు సెంట్రల్: మహిళలు శక్తియుక్తులను, సామాజిక బాధ్యతను మరింత పెంచుకుని అభ్యున్నతి సాధించాలని భారతీయం సత్యవాణి పిలుపునిచ్చారు. జిల్లా నారీ శక్తి సమ్మేళనాన్ని ఆదివారం ఒంగోలులోని విష్ణుప్రియ కన్వెన్షన్ హాలులో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్యవాణి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారని తెలిపారు. రాష్ట్రపతి వద్ద నుంచి శాస్త్రరంగం, కార్పొరేట్ కంపెనీలతో పాటు అన్ని రంగాలను శాసిస్తున్నారని చెప్పారు. సీ్త్ర పరాక్రమవంతురాలు, శక్తివంతురాలు అని వివరించారు. న్యాయవాది శ్రీమతి విజయభారతి మాట్లాడుతూ మహిళలు తమని తాము అభివృద్ధి చేసుకుంటూ కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని అభివృద్ధి చేయడంలో భాగస్వామ్యం వహించాలని కోరారు. నారీశక్తి రాష్ట్ర కో ఆర్డినేటర్, జిల్లా ఇన్‌చార్జి సాధినేని యామిని మాట్లాడుతూ సమాజంలో పిల్లలను సంస్కారవంతంగా పెంచడంలో తల్లి పాత్ర గురించి వివరించారు. దేవాలయాలు, వృద్ధాశ్రమాలను నడపటం వంటి విషయాలపై అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను మహిళలు, యువత అందిపుచ్చుకుని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని కోరారు. సమాజ, దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. పలువురు మహిళలు సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కారణం ఎవరన్న విషయంపై, ఉపాధి విషయాలపై చర్చించారు. సమావేశంలో 1300 మంది మహిళలు పాల్గొన్నారు. జిల్లా కన్వీనర్ విజయలక్ష్మి, నారీశక్తి అమ్మాజి, పద్మావతి, స్థానిక బృందాలు పాల్గొన్నారు.
భారతీయం సత్యవాణి పిలుపు
ఘనంగా నారీ శక్తి సమ్మేళనం