
మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి, పక్కన సీనియర్ న్యాయమూర్తి శ్యాంబాబు
ఒంగోలు సబర్బన్: శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, పలు కేసుల్లో నిందితులుగా ఉండి రిమాండ్‌లో ఉన్న ఖైదీలకు కూడా హక్కులు, బాధ్యతలు ఉంటాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి తెలిపారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగరంలోని జిల్లా జైలులో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి మాట్లాడుతూ సామాన్య ప్రజానీకంతో పాటు ఖైదీలు, నిందితులకు కూడా హక్కులు, బాధ్యతలు ఉంటాయన్నారు. ఇబ్బందులు తలెత్తినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకుని సర్దుబాటు చేసుకుంటే చాలా వరకు సమస్యలు తగ్గుతాయని సూచించారు. తద్వారా నేరాలు తగ్గుముఖం పడతాయని హితబోధ చేశారు. హక్కులు కోరుకునే వారు బాధ్యతలను కూడా విస్మరించకూడదన్నారు. తప్పు చేసిన వారు తమ తప్పు తెలుసుకుని పరివర్తనతో బయటకు వెళ్లి మంచి పౌరులుగా సమాజ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. మంచి ప్రవర్తన అలవాటు చేసుకోవడానికి, చెడుదారి పట్టిన వారు మార్పునకు చదువే ఆధారమన్నారు. జైలు అధికారులు కల్పించిన విద్యా సౌకర్యాల ద్వారా ఖైదీలు విద్యనభ్యసించాలని పిలుపునిచ్చారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కే శ్యాంబాబు మాట్లాడుతూ న్యాయ సహాయం కోరుకున్న ఖైదీలకు ఎలాంటి రుసుం లేకుండా ఉచితంగా సహాయం అందిస్తామని తెలిపారు. అందుకోసం జిల్లా కేంద్ర న్యాయసేవాధికార సంస్థకు సమాచారం అందించవచ్చన్నారు. నిరుపేద ఖైదీలకు ఎలాంటి రుసుం లేకుండా న్యాయ సహాయం అందించడానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ముగ్గురు న్యాయ కోవిదులను నియమించడం జరిగిందన్నారు.
కార్యక్రమంలో జైలర్ వి.రమేష్, కారాగార వైధ్యాధికారి కేఎస్‌వీఎస్ బ్రహ్మతేజ, డిప్యూటీ జైలర్ బి.శ్రీనివాసరావు, జైలు సిబ్బంది, తదితరులు పొల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి
జిల్లా జైలులో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం