● ఉత్సాహంగా 1984–87 బ్యాచ్
డిగ్రీ విద్యార్థుల సమ్మేళనం
మార్కాపురం: ఇరవై తొమ్మిదేళ్ల క్రితం మార్కాపురంలోని ఎస్‌వీకేపీ కళాశాలలో వారంతా క్లాస్‌మేట్స్. అప్పట్లో డిగ్రీ పూర్తి కాగానే ఉన్నత చదువులు, ఉద్యోగాల వేటలో ఎవరికి వారు విడిపోయారు. మరలా 29 సంవత్సరాల తర్వాత ఆదివారం మార్కాపురం పట్టణంలోని ‘విహారి గ్రాన్ ఇన్’లో కలుసుకున్నారు. ‘ఏరా.. ఒరేయ్..’ అంటూ అలనాటి విషయాలు గుర్తు చేసుకుని ఆత్మీయంగా గడిపారు. కుటుంబ సభ్యులు, పిల్లల చదువులు, పెళ్లిళ్లు.. క్షేమ సమాచారాల గురించి చర్చించుకుంటూ ఆరు గంటలపాటు ఉత్సాహంగా గడిపారు. పూర్వ విద్యార్థి బొంతల రామ్ ప్రకాశ్ వీరందరిని కలిపేందుకు ఐదు నెలలపాటు శ్రమించారు. అప్పటి విద్యార్థులు ప్రస్తుత వైఎస్సార్ సీపీ నాయకులులైన ఎస్.రామసుబ్బా రెడ్డి(తర్లుపాడు), మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్షావలి, మధిర రైల్వే స్టేషన్ మాస్టర్ కాశిరెడ్డి, అనంతపురం ట్రాఫిక్ ఎస్సై కొండయ్య, మరో 15 మంది ఉపాధ్యాయులు, న్యాయవాదులు ఉన్నారు.
తమకు చదువు చెప్పిన లెక్చరర్లు పి.వెంగన్న, ముస్తాఫాను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు.