
ఎస్పీ (ఫైల్)
ఒంగోలు అర్బన్: కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈ సోమవారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో స్పందన రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు గమనించి జిల్లా కేంద్రానికి రావద్దని సూచించారు.
లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ మలికాగర్గ్
ఒంగోలు టౌన్: మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని ఎస్పీ మలికాగర్గ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేక బలగాలతో బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమై ప్రాంతాల్లో సహాయక శిబిరాలను, పునరావస కేంద్రాలను ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సముద్ర తీరాల్లో నివసిస్తున్న ప్రజలు పోలీసు, రెవెన్యూ అధికారులు సూచనలను పాటించాలని, ఆయా ప్రాంతాలను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు కానీ, సమీపంలోని తుఫాన్ షెల్టర్లకు కానీ వెళ్లాలన్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులకు రోడ్ల మీద విరిగిపడిన చెట్లను వెంటనే తొలగించి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని, అవసరమైతే ట్రాఫిక్‌ను మళ్లించాలని సూచించారు. ప్రయాణించేందుకు అనువుగా లేని మార్గాల్లో, నీట మునిగిన రహదారులను మూసివేయాలని, ప్రత్యామ్నాయ మార్గాల గుండా వాహనాలు ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నదీ పరివాహక ప్రాంతాల వద్ద ముమ్మరంగా గస్తీ నిర్వహించాలన్నారు. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని జిల్లాలో సముద్రస్నానాలు ఆచరించే భక్తులు , తీరప్రాంతాలను వీక్షించేందుకు వచ్చే పర్యాటకులు తుఫాన్ కారణంగా సముద్రం వద్దకు వెళ్లకుండా ఉండాలన్నారు. అత్యవసరం పరిస్థితుల్లో తక్షణ సహాయం కోసం డయల్ 112, పోలీసు వాట్సప్ నంబర్ 9121102266కు కానీ, స్థానిక పోలీసు అధికారులకు కాని సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.
నేడు చెంచులతో ముఖాముఖి
యర్రగొండపాలెం: మండలంలోని వెంకటాద్రిపాలెం ప్రాంతంలోని చెంచులతో సోమవారం జరిగే ముఖాముఖిలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకరరావు పాల్గొంటారని మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ముందుగా ఎస్టీ కమిషన్ ఉదయం 8.30 గంటల నుంచి చెంచు పునరావాస కాలనీ, హనుమంతుని గూడెంలలో పర్యటిస్తారు. పునరావాస కాలనీలో పోలీస్, అటవీ శాఖ, రెవెన్యూ, ఐటీడీఏ అధికారులు, సిబ్బందితో గిరిజనులకు ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌లో ఆయన పాల్గొంటారు. అనంతరం హనుమంతుని గూడెం ఆశ్రమ పాఠశాలను ఎస్టీ కమిషన్ చైర్మన్ తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారని పేర్కొన్నారు.