
ప్రజా సంస్కృతి సభలో ప్రసంగిస్తున్న జీవీ కృష్ణయ్య
అత్యధిక ప్రజలు
ఒంగోలు టౌన్: ప్రాచీన భారత దేశంలో అమల్లో ఉన్న సనాతన సంప్రదాయాలను దేశంలోని అత్యధిక శాతం మంది ప్రజలు ఆమోదించడం లేదని జన సాహితి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జీవీ కృష్ణయ్య అన్నారు. మహాకవులు గురజాడ, గుర్రం జాషువా, అమరవీరుడు భగత్ సింగ్ జయంతులను పురస్కరించుకొని గురువారం మల్లయ్యలింగం భవన్‌లో సనాతన సంస్కృతి, ప్రజా సంస్కృతి అనే అంశంపై సభ నిర్వహించారు. సభను జన సాహితీ, ప్రజాతంత్ర మేధావులు వేదికలు సంయుక్తంగా నిర్వహించగా ఎం. ఏసుదాసు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ సనాతన సంస్కృతిని రద్దు చేయడం ద్వారా సమాజంలో ఇప్పటికీ కొనసాగుతున్న కుల వ్యవస్థను తొలగించుకోవచ్చన్నారు. దేశంలో రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారం చేపట్టిన పాలకులు అడుగడుగునా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ప్రజాతంత్ర మేధావుల వేదిక కన్వీనర్ పంగులూరి గోవిందయ్య విమర్శించారు. రాజ్యాంగం నుంచి సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను తొలగించడమంటే ప్రజా ఉద్యమాలను చిన్న చూపు చూడడమే అని ఆంధ్రకేసరి విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ హర్ష ప్రీతం దేవ్‌కుమార్ అన్నారు. సభలో తేళ్ల అరుణ, కారుమంచి సుబ్బారావు, రవికుమార్ ప్రసంగించారు. శాంతికుమార్, డీవీ ప్రసన్నతో పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో మేధావులు, విద్యావంతులు హాజరయ్యారు.