
విజయకుమార్‌తో పాదయాత్రలో పాల్గొన్న వరికూటి
కొండపి(సింగరాయకొండ): బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడమే లక్ష్యంగా తాను పాదయాత్ర చేపట్టానని మాజీ ఐఏఎస్ విజయకుమార్ పేర్కొన్నారు. ఆయన చేపట్టిన ఐక్యతా విజయపథం పాదయాత్ర గురువారం కొండపికి చేరుకుంది. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు మండలంలోని పెద్ద కళ్లగుంట గ్రామ సమీపంలో విజయకుమార్‌కు సాదర స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. అనంతరం వరికూటి ఆయనతోపాటు మూడు కిలోమీటర్లు నడిచి పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. సాయంత్రం విజయకుమార్ కొండపి మండల కేంద్రంలోని ఎస్టీ కాలనీ, ఆదిఆంధ్ర కాలనీ, అంబేడ్కర్ నగర్, దాసిరెడ్డి పాలెం ఎస్సీ కాలనీ వాసులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. మాజీ ఐఏఎస్ విజయకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం అనేక ఽపథకాలు రూపొందిస్తోందని, కానీ ఆ పథకాలు సామాన్య ప్రజలకు మరింతగా చేరువకావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజానీకం ప్రభుత్వ పథకాలు పొందేలా జాగృతం చేసి, ఆర్థికంగా నిలదొక్కుకునేలా పాదయాత్రలో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం కందుకూరు నియోజకవర్గానికి చేరుకుంటానని చెప్పారు. ఆదిఆంధ్ర కాలనీ వాసులు విజయకుమార్, ఆయన సతీమణి విజయశ్రీని ఘనంగా సత్కరించారు. వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు ఆరికట్ల కోటిలింగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పోకూరి కోటయ్య, మండల జేసీఎస్ కన్వీనర్ గొట్టిపాటి మురళి, బచ్చల కోటు, ఎస్సై వైవీ రమణయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీ ఐఏఎస్ విజయకుమార్