
● బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు
ఒంగోలు: అర్హులందరికీ జగనన్న చేదోడు పథకం అందేలా చర్యలు చేపడుతున్నట్లు బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. జగనన్న చేదోడు పథకం పెండింగ్ దరఖాస్తులపై గురువారం పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఒంగోలు ఇస్లాంపేట, శివప్రసాద్‌కాలనీ సచివాలయాల పరిధిలో అధిక సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించి స్వయంగా దరఖాస్తుదారులతో మాట్లాడి పరిశీలించారు. ఇస్లాంపేట సచివాలయం పరిధిలో పెండింగ్‌లో ఉన్న 97 మంది దరఖాస్తుదారుల్లో ఇంకా ముగ్గురి దరఖాస్తులను వెరిఫికేషన్ చేయాల్సి ఉందని ఈడీ వెంకటేశ్వరరావు తెలిపారు. శివప్రసాద్‌కాలనీ సచివాలయం పరిధిలో 99 మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ముగ్గురివి మినహా మిగిలిన వారివి వెరిఫికేషన్ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఇస్లాంపేట సచివాలయ పరిధిలో జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిపొందిన మస్తాన్‌రావుతో ఈడీ మాట్లాడారు. జగనన్న చేదోడు పథకం కింద ఇప్పటివరకు తనకు రెండు దఫాలుగా మొత్తం రూ.20 వేలు అందాయని, వాటితో ఇసీ్త్రషాపు పెట్టుకుని రోజుకు రూ.600 సంపాదిస్తున్నానని మస్తాన్‌రావు తెలిపారు. గతంలో కుటుంబం గడవడం కూడా చాలా కష్టంగా ఉండేదని, ప్రస్తుతం స్థిరపడ్డానని చెప్పారు. శివప్రసాద్‌కాలనీకి చెందిన లబ్ధిదారు కడవకుదురు సురేష్‌బాబు కూడా ఈ పథకం ద్వారా అందిన సొమ్ముతో సెలూన్‌షాపులో సామగ్రి ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడించారు. తద్వారా రోజుకు రూ.500 సంపాదిస్తున్నట్లు ఆనందం వ్యక్తం చేశారు. మరో లబ్ధిదారు కట కవిత మాట్లాడుతూ మూడేళ్లుగా మొత్తం రూ.30 వేలు ఈ పథకం ద్వారా తనకు అందాయని, వాటితో టైలరింగ్‌షాపు ఏర్పాటు చేసుకుని రోజుకు రూ.1000 ఆర్జిస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది అందే మొత్తంతో మరో కుట్టుమిషన్ కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. పొతకమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ సదానంద హెయిర్‌స్టైల్ షాపు పెట్టుకున్నానని, దీనవల్ల రోజుకు రూ.500 సంపాదిస్తూ ఆర్థిక బాధల నుంచి గట్టెక్కానని వివరించారు. బీసీ కార్పొరేషన్ ఈడీ వెంట సంబంధిత ప్రాంతాల కార్పొరేటర్లు నూర్జహాన్, నియంతారెడ్డి, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.