జిల్లాలోని పోలింగ్‌ కేంద్రాల్లో మార్పులు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలోని పోలింగ్‌ కేంద్రాల్లో మార్పులు

Sep 22 2023 1:02 AM | Updated on Sep 22 2023 1:02 AM

రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌  - Sakshi

రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

ఒంగోలు అర్బన్‌: జిల్లాలోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మార్పులు చేర్పులు చేసినట్లు కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. స్థానిక ప్రకాశం భవనంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం సమావేశం నిర్వహించారు. జిల్లాలోని పోలింగ్‌ కేంద్రాల్లో మార్పులు, కొత్త పోలింగ్‌ కేంద్రాలపై కసరత్తు పూర్తయిందని తెలిపారు. 8 నియోజకవర్గాల్లో స్థానిక రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారంతో పోలింగ్‌ కేంద్రాలను సరిచేశామన్నారు. 1400 ఓట్లు దాటిన పోలింగ్‌ కేంద్రాలను రెండు పోలింగ్‌ కేంద్రాలుగా చేసినట్లు చెప్పారు. లొకేషన్‌ మార్పు, ఒకే భవనంలో గదుల మార్పులను కూడా పూర్తి చేశామని తెలిపారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు, మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ సేతు మాధవన్‌, ట్రైనీ కలెక్టర్‌ సూర్యమాన్‌ పాటిల్‌, డీఆర్వో శ్రీలత, ఒంగోలు, కనిగిరి ఆర్డీఓలు విశ్వేశ్వరరావు, అజయ్‌కుమార్‌, డిప్యూటీ కలెక్టర్‌ నారదముని, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు, వైఎస్సార్‌ సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్‌, ఇతర పార్టీల ప్రతినిధులు కాలేషా బేగ్‌, రాజశేఖర్‌, సత్యం, రసూల్‌ తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

రేపు ఎంపీ మాగుంట రాక

ఒంగోలు: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈ నెల 23వ తేదీ ఒంగోలు చేరుకుని నగరంలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని మాగుంట కార్యాలయ ప్రతినిధి భవనం సుబ్బారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటలకు రాంనగర్‌లోని తన కార్యాలయంలో ఎంపీ అందుబాటులో ఉంటారు. 11 గంటలకు రాంనగర్‌ రెండోలైనులో గణేష్‌ నవరాత్రి మహోత్సవాల్లో గణేశ భక్తబృందం నిర్వహించే పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి తన కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. సాయంత్రం 7.30 గంటలకు గాంధీరోడ్డులో గణేష్‌ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా తాతా ప్రసాద్‌, గోల్డ్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ సభ్యులు నిర్వహించే పూజా కార్యక్రమానికి హాజరవుతారు. రాత్రి 8.30 గంటలకు రంగుతోటలోని క్లాత్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ కళ్యాణ మండపం వద్ద గణేష్‌ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా కుప్పం ప్రసాద్‌ భక్త బృందం నిర్వహించే పూజా కార్యక్రమంలో ఎంపీ మాగుంట పాల్గొంటారు.

వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షునిగా స్వామిరెడ్డి

ఒంగోలు: వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షునిగా కోమట్ల స్వామిరెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియామకం జరిగినట్లు పేర్కొన్నారు. ఒంగోలు నగరానికి చెందిన స్వామిరెడ్డి 2009 నుంచి అడ్వకేట్‌ దాసరి రవీంద్రనాథ్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేశారు. 2016 నుంచి ఒంగోలులోనే అడ్వకేట్‌గా సొంతంగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు.

నేడు దర్శిలో ‘జగనన్నకు చెబుదాం’

దర్శి: స్థానిక శ్రీ శ్రీనివాస పద్మావతి కళ్యాణ మండపంలో శుక్రవారం దర్శి మండల ప్రజల కోసం జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీటీ రవిశంకర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి మండల కేంద్రంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని కలెక్టర్‌, అన్ని శాఖల జిల్లా అధికారులతో నిర్వహిస్తోంది. అందులో భాగంగా శుక్రవారం దర్శిలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, జేసీ శ్రీనివాసులు, ఆర్డీఓ తోట అజయ్‌కుమార్‌, ఇతర శాఖల జిల్లా అధికారులు హాజరుకానున్నారు. ప్రజలు వారి సమస్యలపై అర్జీలు అందజేస్తే వెంటనే పరిష్కరిస్తామని డీటీ తెలిపారు.

29న విద్యార్థులకు పోటీలు

ఒంగోలు: శ్రీసత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆచార్య దేవోభవ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యా శాఖ అధికారి వీఎస్‌ సుబ్బారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలలకు శ్రీసత్యసాయి సేవా సమితి వలంటీర్లు వచ్చి వ్యాసరచన పోటీలకు అవసరమైన మెటీరియల్‌ సరఫరా చేస్తారన్నారు. పోటీల నిర్వహణ నిమిత్తం వారిని పాఠశాలల్లోకి అనుమతించాలన్నారు. ఈ ఫలితాలను నెలరోజుల్లో సంబంధిత పాఠశాలలకు తెలియజేస్తారని చెప్పారు.

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement