
మాట్లాడుతున్న డీజీఎం రాజేంద్రప్రసాద్
● సిద్బి డీజీఎం రాజేంద్రప్రసాద్
మద్దిపాడు: ఎంఎస్‌ఎంఈ రంగంలో సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి, కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి, విస్తరణకు అవసరమైన రుణ సౌకర్యాలను అందించేందుకు సిద్బి (ఎస్‌ఐడీబీఐ–స్మాల్ ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) సమావేశం ఏర్పాటు చేశారు. మండలంలోని గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో బ్యాంకు డీజీఎం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పారిశ్రామికంగా అన్ని వర్గాలకు రుణ సౌకర్యం కల్పిస్తూ ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీల విస్తరణకు, కొత్త పరిశ్రమలు స్థాపించడానికి సిద్బి దోహదపడుతుందని చెప్పారు. సిద్బి కల్పిస్తున్న వివిధ రకాల రుణ పథకాలపై పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించడానికే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా ఎక్స్‌పోర్ట్స్ కోసం ఉభారే సితారే పథకం అందుబాటులో ఉందని, క్యాపిటల్ సహాయం, గ్రీన్‌ఫీల్డ్ వ్యాపారం కోసం స్థాపన పథకం అందుబాటులో ఉందని తెలిపారు. గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్‌లోని ఎస్‌ఈజెడ్ పరిధిలో ఉన్న పారిశ్రామికవేత్తలు ఈ పథకాల ద్వారా రుణం పొందవచ్చన్నారు. వడ్డీ 8 నుంచి 9.5 శాతంలోపు ఉంటుందని, రూ.50 కోట్ల వరకూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం ఇండస్ట్రీలపై అధిక కరెంటు బిల్లులు పడకుండా ఉండేందుకు నూరు శాతం సోలార్ ఎనర్జీ సేవింగ్ పథకం కేవలం 8 శాతం వడ్డీతో నూరు శాతం రుణ సౌకర్యం కల్పిస్తారని పారిశ్రామికవేత్తలకు తెలిపారు. ఈ అవకాశాలను గ్రోత్ సెంటర్‌లోని ఎక్స్‌పోర్ట్ యూనిట్లు, దాల్‌మిల్లులు, రైస్ మిల్లుల వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆయన వెంట మేనేజర్ వేణుబాబు, ఐలా సభ్యులు లింగారామకృష్ణారెడ్డి చింతల వెంకటేశ్వర్లు, నరసింహారెడ్డి, ఇండస్ట్రియల్ కమిటీ మెంబర్ భక్త వత్సలం, డిక్కీ ప్రతినిధులు, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.