
సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న మార్కాపురం డీఎస్పీ, ఎస్సై
మార్కాపురం రూరల్: గొర్రెల కాపరి దారుణ హత్యకు గురైన ఘటన మంగళవారం ఉదయం మార్కాపురం మండలంలోని ఇడుపూరు గ్రామ శివారులో చోటుచేసుకుంది. రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. ఇడుపూరు గ్రామానికి చెందిన సాగనబోయిన చెన్నయ్య(62) సోమవారం రాత్రి యథావిధిగా గొర్రెలను తీసుకుని పొలానికి వెళ్లాడు. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన గ్రామస్తులు చెన్నయ్య విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించారు. శరీరంపై తీవ్రగాయాలు ఉండటంతో హత్యగా భావించి రూరల్ ఎస్సై వెంకటేశ్వరనాయక్‌కు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి, మార్కాపురం ఇన్‌చార్జి సీఐ దేవప్రభాకర్, ఎస్సై పరిశీలించారు. వివరాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య ఎల్లమ్మ, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

మృతి చెందిన చెన్నయ్య