
స్వామివారికి పూలమాల వేస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్
● మంత్రి ఆదిమూలపు సురేష్
యర్రగొండపాలెం: స్థానిక గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మద్విరాట్ విశ్వకర్మ భగవానుని జయంతి సందర్భంగా ఆదివారం ఆయన దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ ప్రధాన అర్చకుడు వడ్లమాను గోవర్థనాచారికి మంత్రి శాలువాకప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ దొంతా కిరణ్‌గౌడ్, జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కొప్పర్తి చిన్న ఓబులరెడ్డి, శ్రీశైలం దేవస్థానం మాజీ డైరెక్టర్ ఐ.వి.సుబ్బారావు, వేణుగోపాలస్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ యక్కలి భాగ్యారావు, సర్పంచ్‌లు ఆర్.అరుణాబాయి, డి.సుబ్బారెడ్డి, ఎన్.వెంకటరెడ్డి, పి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి
ఒంగోలు: వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మలికాగర్గ్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి, మాజీమంత్రి శిద్దా రాఘవరావు, టీటీడీ పాలకమండలి సభ్యుడు శిద్దా సుధీర్‌కుమార్ ఆకాంక్షించారు. విఘ్నాలకు, సకల దేవ గణాలకు అధిపతి అయి న వినాయకుని ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజించి సకల కార్యసిద్ధి పొంది ఆనందమయ జీవితాన్ని పొందాలని కోరారు. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
నేడు ఎస్పీ స్పందనకు సెలవు
ఒంగోలు టౌన్: వినాయక చవితి పండుగను పురస్కరించుకొని సోమవారం సెలవు దినం కావడంతో జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే పోలీసు స్పందన కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ మలికా గర్గ్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. వినాయక చవితి పండుగ రోజు నుంచి నిమజ్జనం వరకు జరిగే శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఎస్పీ కోరారు.
దొడ్డా మహీధర్‌రెడ్డి సస్పెన్షన్
ఒంగోలు: పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకుగాను కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండలానికి చెందిన దొడ్డా మహీధర్‌రెడ్డిని వైఎస్సార్ సీపీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.