శేష వాహనంపై నరసింహస్వామి

- - Sakshi

సింగరాయకొండ: పాతసింగరాయకొండలోని వరాహ లక్ష్మీనరసింస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి నరసింహస్వామి శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు మెట్ల పూజ నిర్వహించి మొక్కులు చెల్లించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేసినట్లు ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్‌ పామర్తి మాధవరావు తెలిపారు. శనివారం ఉదయం చప్పరసేవ, సాయంత్రం హనుమంతుని వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని ఆలయ ఈఓ పి.కృష్ణవేణి తెలిపారు.

నేడు ఎడ్ల పందేలు

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం సాయంత్రం శ్రీ కృష్ణ యాదవ్‌ యూత్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బండ లాగుడు పోటీలు ఏర్పాటు చేసినట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. పోటీల్లో విజేతలుగా నిలిచిన ఎడ్ల యజమానులకు తొలి మూడు బహుమతులు వరుసగా రూ.70 వేలు, రూ.50 వేలు, రూ.40 వేలు అందజేస్తామని వివరించారు.

5, 6వ తేదీల్లో

ఎడ్ల బల ప్రదర్శన పోటీలు

బేస్తవారిపేట: మండలంలోని అక్కపల్లెలో భూలక్ష్మీ సమేత లక్ష్మీచెన్నకేశవస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈనెల 5, 6వ తేదీల్లో రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 5న రెండు పళ్ల విభాగంలో గెలుపొందిన ఎడ్ల యజమానులకు మొదటి, రెండో, మూడో, నాలుగో, ఐదో బహుమతులు వరుసగా రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.8, రూ.5 వేలు, అలాగే 6న న్యూ కేటగిరీ విభాగంలో గెలుపొందిన ఎడ్ల యజమానులకు ఐదు బహుమతులు వరుసగా రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు అందజేస్తామని వివరించారు. పూర్తి వివరాలకు 9849490257, 9133262194, 9959815290ను సంప్రదించాలని కోరారు.

7న పూసలపాడులో..

పూసలపాడులో అభయ ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 7న ఆరు పళ్ల విభాగంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన ఎడ్ల యజమానులకు మొదటి నాలుగు బహుమతులు వరుసగా రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు అందజేస్తామని పేర్కొన్నారు. వివరాలకు 91822 25180, 70138 64288, 63019 46022ను సంప్రదించాలని సూచించారు.

పొగాకు అత్యధిక ధర రూ.203

టంగుటూరు: స్థానిక పొగాకు వేలం కేంద్రంలో శుక్రవారం కేజీ గరిష్ట ధర రికార్డు స్థాయిలో రూ.203గా నమోదైంది. చిరుకూరపాడు, పంగులూరివారిపాలెం గ్రామాల రైతులు 1006 బేళ్లను వేలానికి ఉంచగా వ్యాపారులు 971 కొనుగోలు చేశారు. 38 పొగాకు బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. కనిష్ట ధర కేజీ రూ.160, సరాసరి రూ. 199.84 పలికింది. వేలంలో మొత్తం 28 మంది వ్యాపారులు పాల్గొన్నారని నిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.

ముగ్గురు ఫీల్డ్‌ అసిస్టెంట్లు సస్పెన్షన్‌

యర్రగొండపాలెం: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలకు పాల్పడిన ముగ్గురు ఫీల్డ్‌ అసిస్టెంట్లపై సస్పెన్షన్‌ వేటు పడిందని ఏపీఓ ఎం.శైలజ శుక్రవారం తెలిపారు. 14వ విడత సామాజిక తనిఖీల్లో భాగంగా యర్రగొండపాలెం, మిల్లంపల్లి ఫీల్డ్‌ అసిస్టెంట్లు తూమాటి వెంకటేశ్వర్లు, సండ్రపాటి బాబు సస్పెండ్‌ అయ్యారని, వీరభద్రాపురానికి చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఆతుకూరి రమణారెడ్డి కూలీలకు ఉపాధి కల్పించకపోవడం, డబ్బు వసూలు చేశాడని వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టి సస్పెండ్‌ చేసినట్లు వివరించారు.

పెళ్లయిన 18 రోజులకే..

ఉరివేసుకొని యువతి ఆత్మహత్య

కొత్తపట్నం: వివాహిత యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తపట్నం బస్టాండ్‌ సెంటర్‌ సమీపంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొత్తపట్నం గ్రామానికి చెందిన వెన్నపూసల వైష్ణవి (19) లింగసముద్రం మండలం అదే గ్రామానికి చెందిన వెన్నపూసల భాస్కర్‌రెడ్డికి ఇచ్చి 18 రోజుల క్రితం వివాహం చేశారు. 16 రోజుల పండుగకు అల్లుడు భాస్కర్‌రెడ్డి కొత్తపట్నంలో అత్తగారింటికి వచ్చాడు. 16 రోజుల పండుగ కూడా బాగా చేసుకొన్నారు. అయితే ఏమైందో తెలియదు గానీ శుక్రవారం ఇంటిలో ఎవరూ లేని సమయం చూసి చున్నీతో ఉరివేసుకొంది. కొద్దిసేపటికి బంధువులు చూడటంతో దూలానికి వేలాడుతూ కనిపించింది. అక్కడే ఉన్న బంధువులు ఆమెను హుటాహుటిన ఒంగోలు రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని తల్లి సులోచన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సాంబశివరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Prakasam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top