దళితులపై చంద్రబాబు కపట ప్రేమ

YSRCP MLA Merugu Nagarjuna Slams Chandrababu Naidu - Sakshi

ఏనాడైనా దళితుల్ని మనుషులుగా చూశారా?

టీడీపీ, బాబు చరిత్ర చూస్తే వారి దుర్బుద్ధి తెలుస్తుంది

దళితుల మీద దాడులు చేస్తే పోలీసుల్ని కూడా అరెస్ట్‌ చేశాం

బాబు హయాంలో దళితులపై దాడులు చేసిన వారిని అరెస్ట్‌ చేశారా?

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, కైలే అనిల్‌ కుమార్‌

సాక్షి, అమరావతి : ప్రతిపక్ష నేత చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో దళితుల్ని ఏనాడు మనుషులుగా చూసిన దాఖాలాలు లేవని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు. దళితులపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. అందరికంటే ఎక్కువగా దళితులకు మంచి చేసింది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

బాబు ఒంటి నిండా దుర్మార్గపు ఆలోచనలే
♦ తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల్లో దళితుల మీద దాడులు చేస్తే చివరికి పోలీసుల్ని కూడా వదలకుండా అరెస్టు చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే. 
♦ చంద్రబాబు జీవితంలో ఇలాంటి పని ఎప్పుడైనా చేశారా? దళితుల మీద దాడులు చేసిన వారిని తన రాజకీయ జీవితంలో ఏనాడైనా ఇంత వేగంగా అరెస్టు చేయించారా? వెంటనే వారికి పరిహారం ప్రకటించిన సందర్భం ఉందా? ఏ ప్రభుత్వం అయినా ఇంత పారదర్శకంగా వ్యవహరించగలదా? 
♦ దళితుల మీద దాడులు జరుగుతున్నాయంటున్న బాబు, టీడీపీల దుర్బుద్ధి వారి చరిత్రే చెబుతుంది. దళితులకు, బీసీలకు మధ్య చిచ్చు పెట్టాలి, దళితులకు, దళితులకు మధ్య చిచ్చు పెట్టాలి, దళితులకు, ఓసీలకు మధ్య చిచ్చు పెట్టాలన్నదే బాబు వ్యూహం. బాబు ఒంటి నిండా ఇలాంటి వంకర ఆలోచనలే. 
ఒక్క మంచి పని అయినా చేశారా?
♦ బాబు ట్వీట్లు.. ప్రెస్‌మీట్లు, నారా లోకేశ్‌ ట్వీట్లు, వర్ల రామయ్యలాంటి దగా పడిన దళిత నేత ప్రెస్‌మీట్ల ద్వారా దళితులపై మొసలి కన్నీరు కార్చటం మొదలు పెట్టారు. బాబు అధికారంలో ఉంటే దళితులంటే చులకన. అధికారం పోయాక చూపేది కపట ప్రేమ. 
♦ సీఎం వైఎస్‌ జగన్‌కు దళితులపై సొంత పిల్లల మీద ఉండే ప్రేమ ఉంది. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఏనాడైనా 60 % మంత్రి పదవుల్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాడా? ఒక దళిత మహిళను ఏనాడైనా హోం మంత్రి చేశాడా? ఒక ఎస్టీని డీజీపీగా నియమించాడా? ఎస్సీని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించారా?  
♦ ఇళ్ల స్థలాలు,ఇంగ్లిష్‌ మీడియం చదువులపై కోర్టుకు వెళ్లి అడ్డుపడ్డారు. ఎస్‌ఈసీగా రాజ్యాంగం తెలిసిన హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిని నియమిస్తే వీల్లేదని కోర్టుకు వెళ్లి అడ్డుకుంటారు. దేశంలో కెల్లా పెద్దదైన అంబేడ్కర్‌ విగ్రహాన్ని విజయవాడ మధ్యలో ఏర్పాటు చేస్తుంటే వీల్లేదని రోజుకో ప్రెస్‌మీట్‌ పెట్టిస్తారు. 
♦ ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా.. అని స్టేట్‌మెంట్లు ఇచ్చిన ఆయన అందుకు ఎప్పటికీ క్షమాపణ చెప్పరు. కారంచేడు, చుండూరులో దళితులపై టీడీపీ నాయకులు దాడులు చేస్తే ఏనాడు పశ్చాత్తాప పడలేదు. బాబు అధికారంలో ఉండగా ఎస్సీ, ఎస్టీల మీద అత్యాచారాల్లో దేశంలోనే ఏపీ నాలుగో స్థానంలో ఉండి అప్రతిష్టపాలైనా ఆయనకు ఏ బాధా ఉండదు.

అంతా మొసలి కన్నీరే
♦ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను బాబు ఏ రోజూ అమలు చేసిన పాపాన పోలేదు. రాష్ట్రంలో ఏ మూలన చిన్న సంఘటన జరిగినా రాజకీయం చేస్తారు. 
♦ సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.4 లక్షల శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేశారు. అందులో 82.5 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. ఇదొక భారీ రికార్డు. 
♦ ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు ద్వారా తాత్కాలిక ఉద్యోగాల్లో కూడా దేశంలోనే తొలిసారిగా రిజర్వేషన్లు వర్తింప చేశారు.   
♦ బాబు, టీడీపీలో దగా పడ్డ దళిత తెలుగు తమ్ముళ్లు దళితుల మీద మొసలి కన్నీరు కారుస్తున్నారు. బాబు గావు కేకలను ప్రజలు నమ్మరు.  దళిత సమాజం అసలు నమ్మదు. 
♦ టీడీపీలో దగా పడిన దళిత సోదరుడు వర్ల రామయ్య ఈరోజు హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌కు ఉత్తరాలు రాస్తున్నాడు. వర్ల రామయ్య ఉత్తరం రాయాల్సి వస్తే.. దళితుల్లో ఎవరు పుట్టాలనుకుంటారన్న చంద్రబాబు మీద రాయాలి. రామయ్యా.. ఇంకా దగా పడొద్దు.  

దళిత ద్రోహి చంద్రబాబు
దళితులపై బాబు హయంలో జరిగిన సంఘటనలు కోకొల్లలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ విమర్శించారు. ‘చంద్రబాబు దళిత ద్రోహి, దళిత వ్యతిరేకి. బాబు అధికారంలో ఉన్నప్పుడు దళితుల భూములు లాక్కోవడం దగ్గర నుంచి.. దళిత మహిళలను వివస్త్రను చేసి రోడ్డు మీద కొట్టిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. బాబు అధికారంలో ఉండగా దళితులపై దాడులు చేసిన టీడీపీ నాయకులను ప్రోత్సహించారు’ అని మండిపడ్డారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top