
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ఆటలో సునీత కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. తన తండ్రిని ఓడించిన వారికి ఈరోజు ఎలా మద్దతిస్తారో సునీత సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు.. కడపలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వివేకా కుమార్తె, అల్లుడితో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. అవినాష్ రెడ్డిని రాజకీయ బలిపశువు చేయాలనుకుంటున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.
మాజీ మంత్రి మేగురు నాగార్జున తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో ఓ వైపు అరాచకాలు చేస్తూనే.. మరోసారి వివేకా హత్యను తెరపైకి తెచ్చారు. చంద్రబాబు ఏరోజూ నిజాయితీగా రాజకీయాలు చేయలేదు. ఎప్పుడూ తప్పుడు పద్ధతులతోనే రాజకీయాలు చేస్తున్నాడు. కడపలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వివేకా కుమార్తె, అల్లుడితో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. చంద్రబాబును ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలుసు. అందుకే హఠాత్తుగా సునీతను రంగంలోకి దింపారు. సునీత చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారింది. గత రెండు ఎన్నికల్లో వివేకానందరెడ్డి హత్య కేసును వాడుకుని లబ్ది పొందాలని చూశాడు.
అవినాష్ రెడ్డిపై కుట్ర..
వివేకానందరెడ్డిని చంపింది తానే అని దస్తగిరి ఒప్పుకున్నది నిజం కాదా?. వివేకా హత్య ఎవరి హయాంలో జరిగింది. వ్యవస్థలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి. చంద్రబాబు చేతిలో వ్యవస్థలు ఉన్నా సీబీఐ చేతికి కేసు వెళ్లింది నిజం కాదా?. అవినాష్ రెడ్డిని రాజకీయ బలిపశువు చేయాలనుకుంటున్నారు. ఎన్నికలు వస్తున్నాయనగానే వస్తారు.. నాలుగు నిందలు వేసి వెళ్లిపోతారు. చంద్రబాబు రాజకీయ ఆటలో సునీత తోలుబొమ్మగా మారింది. తన తండ్రికి బద్ధశత్రువులైన వారితోనే సునీత చేతులు కలిపారు.
బాబు ప్లానే..
వివేకానందరెడ్డి రెండో భార్య విషయం.. ఆమెతో జరిగిన ఛాటింగ్ ఎందుకు బయటకు రావడం లేదు. ఎవరి ప్రోద్భలంతో బయటికి రావడం లేదో సునీత చెప్పాలి. హత్య ఎవరు చేశారో చెప్పిన తర్వాత కూడా అతన్ని అప్రూవర్‌గా మార్చింది ఎవరో తెలియదా?. వెయ్యి రూపాయలు లేని కారు డ్రైవర్ దస్తగిరి.. ఈరోజు కాన్వాయ్‌కు ఓనర్ అయిపోయాడు. దేశంలోనే అత్యంత ఖరీదైన న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా దస్తగిరి తరపున వాదిస్తున్నాడు. సిద్ధార్ధ్ లూథ్రా.. చంద్రబాబు మనిషి అని మీకు తెలియదా?. నీ తండ్రిని ఓడించిన వారికి ఈరోజు ఎలా మద్దతిస్తారో సునీత సమాధానం చెప్పాలి.

పులివెందులలో వ్యవస్థలను చంద్రబాబు తన చేతిలో పెట్టుకున్నాడు. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై ఓ చర్చ నడుస్తోంది. వందకు వందశాతం 2024 ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి. 2024 ఎన్నికలు జరిగిన తీరుపై మాకు కొన్ని సందేహాలున్నాయి. విజయనగరంలో ఎన్నికలప్పుడు 40% శాతం ఎన్నికలయ్యాక 90% ఈవీఎంలలో చార్జింగ్ ఉంది. వీవీప్యాట్స్ స్లిప్పుల్లో తేడాలున్నాయి. కౌంటింగ్ సీసీ ఫుటేజీని కోరాం. మా సందేహాలను నివృత్తి చేయమని మేం ఎన్నికల కమిషన్‌ను కోరాం’ అని చెప్పుకొచ్చారు.