మృతుల కుటుంబాలకు అండగా ప్రభుత్వం

YSRCP Leaders Comments On Chandrababu Road Shows - Sakshi

వారి ఇళ్లకు వెళ్లి రూ.2 లక్షల సాయం పంపిణీ

గాయపడిన 19 మందికి ఆస్పత్రుల్లోనే రూ.50 వేల చొప్పున సహాయం

సాయం పంపిణీ  చేసిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ 

సభలకు చంద్రబాబు విరామం చెప్పాలి: మంత్రి అంబటి

చంద్రబాబును అరెస్టు చేయాలి: మంత్రి మేరుగు నాగార్జున

ఈ మరణాలకు బాబుదే బాధ్యత: మంత్రి విడదల రజిని

గుంటూరు ఈస్ట్‌: చంద్రన్న కానుక సభలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందినవారి కుటుం­బాలకు, గాయపడినవారికి రాష్ట్ర ప్ర­భు­త్వ సహాయాన్ని  మంత్రులు, వైఎ­స్సార్‌­సీపీ ప్రజాప్రతినిధులు మంగళవారం పంపిణీ చేశారు. మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, విడదల రజిని, ఎమ్మె­ల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య­వరప్రసాద్, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరిధర్, కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి మృతుల ఇళ్లకువెళ్లి వారి కుటుంబ సభ్యు­లను ఓదా­ర్చారు. ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు.

గాయ­పడి జీజీ­హెచ్‌లో చికిత్స పొందుతున్న మొత్తం 19 మందికి రూ.50 వేల చొప్పున చెక్కులు అందించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యచికిత్స అందించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా మంత్రులు.. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సభ అనుమతి కోరుతూ చేసిన దరఖాస్తులను మీడియాకు చూపించారు. అందులో ఎక్కడా కానుకలు ఇస్తున్నట్లు లేకపోవడాన్ని ప్రస్తావించారు. టీడీపీ తప్పుడు ప్రచారాలను దుయ్యబట్టారు. 

మానవ ప్రేరిత దుర్ఘటనే
మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఇది దురదృష్టకర ఘటనని, దిగ్భ్రాంతి కలిగించిందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందారని, బాధితులకు సహాయాన్ని పంపారని తెలిపారు. ఇది మానవ ప్రేరిత దుర్ఘటనేనన్నారు. టీడీపీ నేతలు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇది జరిగేది కాదని చెప్పారు. కానుకల పేరిట వేలాదిమంది పేద మహిళలను సభకు తరలించి ముఖ్యమంత్రిని విమర్శించడమే ధ్యేయంగా చంద్రబాబు సభను నడిపారని మండిపడ్డారు.  

జరిగిన తప్పిదానికి సిగ్గుపడాల్సిందిపోయి వైఎస్సార్‌సీపీ నాయకులపై ఎదురుదాడికి దిగడం దుర్మార్గమని చెప్పారు. పుష్కరాల్లో, కందుకూరులో, గుంటూరులో సామాన్య ప్రజలు చనిపోవడం క్షమించరాని నేరమని చెప్పారు. కానుకలు పేదల ఇంటికి పంపించి ఉంటే ఈ దుర్ఘటన జరిగేది కాదుకదా అని పేర్కొన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకుని బహిరంగసభలకు విరామం చెప్పాలని ఆయన సూచించారు.

చంద్రబాబుది నీచ ప్రవృత్తి  
మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ కందుకూరు సభలో ఎనిమిదిమంది చనిపోతే, వారికి కులాలు అంటగట్టి తన వెంట ఉన్నారని చంద్రబాబు ప్రకటించడం అతడి నీచమైన ప్రవృత్తిని తెలియజేస్తోందని విమర్శించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సభకు అనుమతి కోరారేగానీ, అందులో కానుకల విషయం ప్రస్తావించలేదని చెప్పారు. పోలీసులు అప్రమత్తంగా ఉండటం వల్లే ప్రమాద తీవ్రత తగ్గిందని, లేకపోతే పెద్దసంఖ్యలో చనిపోయేవారని పేర్కొన్నారు. చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి అరెస్టు చేయాలని కోరారు. చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మరణాలకు కారణమవుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీడీపీ ఉనికి కోల్పోయింది
మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధితులకు ఆర్థికసాయం అందజేశామని చెప్పారు. గాయపడినవారికి ప్రత్యేక వైద్యం అందిస్తున్నామన్నారు. చంద్రబాబు ప్రచారయావతో ప్రజలను సభకు తరలించేందుకు కానుకల పేరుతో మోసం చేశారని విమర్శించారు. టీడీపీ ఉనికి కోల్పోయిందన్నారు. సభ అయ్యేవరకు కానుకలు ఇవ్వకుండా మహిళలను గంటల తరబడి నిలబెట్టడం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సభకు అనుమతి కోరి ఇప్పుడు తప్పంతా ఫౌండేషన్‌ మీదకు నెట్టడం సిగ్గుచేటని చెప్పారు.

జగనన్న పాలనలో మహిళలు పథకాలు అందుకుని సంతోషంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీ వల్లే 40 మంది చనిపోయారని, ఈ మరణాలన్నింటికీ ఆయనే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మేయర్‌ కావటి శివనాగమనోహర్‌నాయుడు, డిప్యూటీ మేయర్లు డైమండ్‌బాబు, షేక్‌ షజిల, మిర్చి యార్డు చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బత్తుల దేవానంద్, వైఎస్సార్‌సీపీ కార్యనిర్వాహకమండలి సభ్యుడు తాడిశెట్టి మురళి, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top