
సీఎం చంద్రబాబుపై ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్ ధ్వజం
ఏం పాపం చేశారని మా పార్టీ నాయకులపై దాడి చేశారు?
ఒక జడ్పీటీసీ కోసం ఇంతలా దిగజారాలా?
ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం
అన్యాయాలన్నీ వడ్డీతో సహా తిరిగి చుట్టుకుంటాయి
సాక్షి, అమరావతి: పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రౌడీ రాజకీయాలు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. పులివెందుల మండలం నల్లగొండువారిపల్లెలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, వేముల మండల పార్టీ పరిశీలకుడు వేల్పుల రామలింగారెడ్డిపై టీడీపీ మూకలు హత్యాయత్నానికి పాల్పడ్డాయన్నారు.
వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేసి రమేశ్‌యాదవ్, రామలింగారెడ్డిను తీవ్రంగా గాయపరిచారన్నారు. ఏం పాపం చేశారని దాడి చేశారు? ఎందుకు ఇలా గాయపరిచారు? అని ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు. ఈమేరకు బుధవారం తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ‘మంగళవారం సాయంత్రం పులివెందులలో జరిగిన మరో ఘటనలో.. ఓ వివాహానికి హాజరైన వైఎస్సార్‌సీపీ నాయకులపై ఫంక్షన్ హాల్‌లోనే టీడీపీ వాళ్లు దాడి చేశారు.
ఈ ఘటనలో అమరేష్‌రెడ్డి, సైదాపురం సురేష్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుకోబోయిన పెళ్లివారిని, శ్రీకాంత్, నాగేశ్, తన్మోహన్రెడ్డి తదితరులను కూడా దారుణంగా కొట్టారు..’ అని పేర్కొన్నారు. ‘ఇప్పటివరకూ దాదాపు 100 మందికిపైగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను బైండోవర్ చేశారు. ఇంకా చాలామందిని బైండోవర్ చేసి నిర్బంధించాలని యత్నిస్తున్నారు. ఇంత బరి తెగించి దాడులు చేసిన టీడీపీ వారిపై కేసులు లేవు. అరెస్టులు కూడా లేవు.
టీడీపీ నుంచి ఒక్కరిని కూడా బైండోవర్ చేయలేదు’ అని ధ్వజమెత్తారు. ‘మా పార్టీకి చెందిన నాయకుడిని బెదిరించి, భయపెట్టి తమవైపు లాక్కుని.. ఆ పార్టీ మారిన వ్యక్తితో తప్పుడు ఫిర్యాదు ఇప్పించారు. దాన్ని అడ్డు పెట్టుకుని వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి, మరో కార్యకర్త గంగాధర్‌రెడ్డిపై పోలీసులు మరో తప్పుడు కేసు పెట్టారు..’ అని మండిపడ్డారు. ‘పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ఆదేశాల మేరకు ఒక పథకం ప్రకారం కుట్రలు చేస్తూ ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో హింసను రాజేస్తున్నారు.
ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఈ ఎన్నిక జరగకూడదని... వైఎస్సార్‌సీపీకి చెందిన కార్యకర్తలు, నాయకులెవరూ తిరగకూడదని పోలీసులను ఉపయోగించుకుని చంద్రబాబు ఈ అరాచకాలన్నీ చేయిస్తున్నారు..’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒకవైపు అక్రమ కేసులు, అరెస్టులు, బైండోవర్లతో పోలీసులు మా పార్టీ నాయకులను, కార్యకర్తలను బెదిరిస్తుంటే మరోవైపు టీడీపీ గ్యాంగ్‌లు టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతున్నాయి. ఈ గ్యాంగ్‌లు దాడులు చేసేందుకు వీలుగా ఉద్దేశ పూర్వకంగానే పోలీసులు ప్రేక్షక పాత్రను పోషిస్తున్నారు.
రెండు రోజులుగా వరుసగా దారుణ ఘటనలకు కారకులైన వారిలో ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ ప్రాంత డీఐజీ ఈ కుట్రను అమలు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక జడ్పీటీసీ స్థానం కోసం చంద్రబాబు ఇంతగా దిగజారిపోతారా?’ అని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ‘పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో శాంతి భద్రతలు దిగజారడంతో పాటు పోలీసులు టీడీపీకి కొమ్ముకాయడం, వ్యవస్థలను నీరుగార్చడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.
ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తెస్తామని ప్రకటించారు. చంద్రబాబు రౌడీ రాజకీయాలను పులివెందుల సహా రాష్ట్ర ప్రజలు ఎవరూ సహించరని, ఆయనకు తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. ‘ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు. కళ్లు మూసి తెరిచేసరికి మరో మూడేళ్లు అయిపోతాయి. ఆ తర్వాత మీరు చేసిన ఈ అన్యాయాలన్నీ వడ్డీతో సహా తిరిగి చుట్టుకుంటాయని గుర్తుపెట్టుకోవాలి’ అని హెచ్చరించారు.