చంద్రబాబూ.. మీ బతుకంతా మోసమేనా?: వైఎస్‌ జగన్‌ | Ys Jagan Fires On Chandrababu Over Pension Cut For Disabled People | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ.. మీ బతుకంతా మోసమేనా?: వైఎస్‌ జగన్‌

Aug 26 2025 10:35 PM | Updated on Aug 26 2025 10:42 PM

Ys Jagan Fires On Chandrababu Over Pension Cut For Disabled People

సాక్షి, తాడేపల్లి: వికలాంగుల పెన్షన్‌ కోతపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబూ.. మీ బతుకంతా మోసమేనా? మీరొక ఘరానా మోసగాడని ఈ 15 నెలల పరిపాలనా కాలంలో ప్రతిరోజూ రుజువవుతూనే ఉంది. ప్రజలకు ఏం చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు?’’ అంటూ ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్‌ నిలదీశారు.

‘‘అధికారంలోకి వస్తే జగన్‌ ఇస్తున్న పథకాలేకాదు, అంతకుమించి ఇస్తామన్నారు. సూపర్‌ సిక్స్‌ అన్నారు, సూపర్‌ సెవెన్‌ అన్నారు. కానీ ఇదివరకే ఉన్నవాటికి మంగళం పాడేయడమేకాదు, తప్పక ఇవ్వాల్సిన వాటికి కూడా కోతలు పెడుతున్నారు. చంద్రబాబూ.. పెన్షన్లలో కోత లేకుండా, ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఇస్తామని ఎన్నికల ప్రచారసభల్లో ఊదరగొట్టారు, ఊరూరా మీ వాళ్లతో చెప్పించారు. 2024, మార్చిలో ఎన్నికల నాటికి మా ప్రభుత్వం హయాంలో పెన్షన్ల సంఖ్య 66,34,372. కాని, మీరు ఈ ఆగస్టులో ఇచ్చిన పెన్షన్లు 62,19,472. అంటే ఏకంగా 4,14,900 పెన్షన్లను నిర్దాక్షణ్యంగా మీరు కత్తిరించడమే కాకుండా కొత్తగా ఒక్క పెన్షన్‌కూడా మంజూరు చేయలేదు. ఇది మోసం కాదా? దగా కాదా?’’ అంటూ వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

..విధివంచితులైన దివ్యాంగుల పట్ల కనీసం జాలి, దయ చూపకుండా అమానవీయంగా వారి పెన్షన్లను కూడా కట్‌ చేశారు.. చేస్తున్నారు. రీ వెరిఫికేషన్‌ పేరిట వారికి నరకయాతన చూపిస్తున్నారు. వారిని ఇంతగా కష్టపెట్టడం మానవత్వం అనిపించుకుంటుందా? మనిషి అన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? దివ్యాంగులకు ఇచ్చే సర్టిఫికెట్లకోసం ఉన్న దారుణమైన పద్ధతులను మార్చి, మా ప్రభుత్వ హయాంలో వారికోసం ప్రత్యేకంగా సదరం క్యాంపులు ఏర్పాటు చేసి, సర్టిఫికెట్లు మంజూరుచేసి, 2024 మార్చి నాటికి 8,13,316 మంది దివ్యాంగులకు మేం పెన్షన్లు ఇచ్చి వారి జీవితాలకు భరోసాగా నిలిచాం. కాని, మీరు వీరిని దొంగలుగా చిత్రీకరిస్తూ ఇందులో లక్షల మందికి నోటీసులు ఇచ్చి, వారికి వారి జీవనాడిని కత్తిరించే ప్రయత్నాలు చేస్తున్నారు.

..చంద్రబాబూ.. ఆరోజు సర్టిఫికెట్లు ఇచ్చింది ఈ గవర్నమెంటు డాక్టర్లే అయినప్పుడు, అవి తప్పుడు సర్టిఫికెట్లు ఎలా అవుతాయి? పైగా లంచాలకోసం డాక్టర్లు ఆశపడ్డారంటూ తప్పుడు ప్రచారం చేయడం దారుణం కాదా? దివ్యాంగులను ఈ రకంగా ఇబ్బంది పెట్టి వారు బలవన్మరణాలకు పాల్పడేలా చేయడం దుర్మార్గం కాదా? ఇది మోసం కాదా? మీ భారాన్ని తగ్గించుకోవడానికి మీరు ఎన్నుకున్న దారి అన్యాయం కాదా? ఇది మోసం కాదా? దగా కాదా? వీటి పరిస్థితి ఇది అయితే, ఇక యాభై ఏళ్లకే పెన్షన్‌ ఇస్తామంటూ మీరు చేసింది మరో అతిపెద్దమోసం. ఇది దగా కాదా? అందుకే బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ!’’ అంటూ వైఎస్‌ జగన్‌ దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement