ఏపీలో నో పోలీస్, నో పోలీస్, నో పోలీస్.. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒక జంగిల్ రాజ్‌గా మారిపోయిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు గురువారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘కాగితాలపై మాత్రమే పోలీసులు కనిపిస్తున్నారు. కానీ గిరిజనులు, మహిళలు, పేదలు సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నప్పుడు, వారు సహాయంకోసం అర్థిస్తున్నప్పుడు పోలీసులు కనిపించడంలేదు. మరోవైపు నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ నంబర్లు కూడా స్పందించడం లేదు. ఫలితంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అధికారంలో ఉన్నవారు ప్రజల భద్రతను గాలికి వదిలేసి, అవినీతి, రాజకీయ ప్రయోజనాలు, ప్రచార స్టంట్లపై దృష్టి పెడుతున్నారు. ఒక 17 ఏళ్ల నిరుపేద గిరిజన బాలిక రాష్ట్రంలో కుప్పకూలిపోయిన వ్యవస్థకు బలైపోయింది. చదువులు చెప్తామని ఆమెను తీసుకువెళ్లి దారుణానికి పాల్పడ్డారు.
మార్చి 22న శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో ఒక సివిల్ ఇంజనీర్ ఆమె కుటుంబానికి మాటలు చెప్పి, ట్యూషన్ చెప్తానని నమ్మబలికాడు. ఆ తర్వాత మార్చి 23న విశాఖపట్నంలో ఆమెపై పలు మార్లు లైంగిక దాడి జరిగినట్లు మీడియా కథనాల్లో స్పష్టంగా వచ్చింది. మార్చి 24న, ఆ బాలిక మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రుల ఇంటికి డోర్ డెలివరీ చేశారు. ఇది కేవలం క్రూరత్వం మాత్రమే కాదు, వ్యవస్థల వైఫల్యాన్ని సూచిస్తోంది’ అని పేర్కొన్నారు.


