మామూళ్ల మత్తు.. ప్రాణాలు చిత్తు | Chandrababu Govt Corruption with Private Travels Reason Behind Road Accidents | Sakshi
Sakshi News home page

మామూళ్ల మత్తు.. ప్రాణాలు చిత్తు

Mar 27 2026 5:00 AM | Updated on Mar 27 2026 5:00 AM

Chandrababu Govt Corruption with Private Travels Reason Behind Road Accidents

గతేడాది కర్నూలులో జరిగిన ప్రమాదంలో కాలిపోయిన ట్రావెల్స్‌ బస్సు (ఫైల్‌)

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ దందాకు ‘పచ్చ’ సిండికేట్‌ వత్తాసు

‘రవాణా’ కీలక నేతే రింగ్‌ మాస్టర్‌.. ఏటా రూ.కోట్లలో మామూళ్ల దందా

కాసులు ఇస్తే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌లు.. నిబంధనలు పాటించకున్నా పచ్చజెండా

దాంతోనే ఘోర రోడ్డు ప్రమాదాలు

గతేడాది కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదం తరువాత రెండు రోజులు హడావుడి

ఆ ముసుగులో వసూళ్ల దందా

అనంతరం షరా ‘మామూళ్లే!’

దాంతోనే మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం..14 మంది బలి

అవి దుర్మరణాలు కావు... ప్రభుత్వ హత్యలే!

సాక్షి, అమరావతి: మరో ఘోర బస్సు ప్రమాదంతో రాష్ట్రం ఉలిక్కిపడుతూ నిద్ర లేచింది. గురు­వారం తెల్లవారకుండానే 14 మంది ప్రయా­ణికుల బతుకులు తెల్లారిపోయాయి. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. రవాణా శాఖ కేంద్రంగా రాష్ట్రంలో అవినీతి సిండికేట్‌ మరోసారి ప్రయాణికుల ప్రాణాలను బలిగొంది. ఇవి కేవలం రోడ్డు ప్రమాదంతో సంభవించిన దుర్మరణాలు కావు... బరి తెగించి అవినీతి దందా సాగిస్తూ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ మాఫియాకు వత్తాసు పలుకుతున్న ‘రవాణా’ సిండికేట్‌ చేసిన హత్యలు! రాయలసీమకు చెందిన ప్రభుత్వ కీలక నేత రింగ్‌ మాస్టర్‌గా ఉన్న ఈ సిండికేట్‌ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నుంచి ఏటా వసూలు చేస్తున్న మొత్తం దాదాపు రూ.80 కోట్లు...! ప్రైవేట్‌ ట్రావెల్స్‌ అక్ర­మాలకు, నిబంధనలకు విరుద్ధంగా సర్వీసుల నిర్వహణకు ఆ సిండికేట్‌ వత్తాసు పలుకుతోంది. ఫలితం... తరచూ రోడ్డు ప్రమాదాలు... ప్రయాణికుల దుర్మరణాలు రాష్ట్రంలో సర్వ సాధారణంగా మారిపోయాయి. మార్కాపురం జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదమే అందుకు తాజా తార్కాణం. అవి దుర్మరణాలు కావు.. రవాణా శాఖలో పచ్చ సిండికేట్‌  చేసిన హత్యలు...!!

స్టీరింగ్‌ పని చేయని బస్సుకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌...!
మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైన హరికృష్ణ ట్రావెల్స్‌ బస్సు (రిజిస్ట్రేషన్‌ నంబరు ఏఆర్‌ 20 డి 0487)కు ఈ ఏడాది డిసెంబర్‌ 9 వరకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఉంది. రవాణా శాఖే ఆ మేరకు ఎఫ్‌సీ జారీ చేసింది. ఆ బస్సుకు 2027 జనవరి 8 వరకు పర్మిట్‌ కూడా ఉంది. తెలంగాణలోని జగిత్యాల నుంచి ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా కలిగిరి వెళుతుండగా ఆ బస్సు మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ప్రమాదానికి గురైంది. బస్సు స్టీరింగ్‌ సక్రమంగా పని చేయకపోవడంతోనే ప్రమాదం సంభవించింది. 

స్టీరింగ్‌ స్టక్‌ అయిపోవడం (బిగుసుకుపోవడం)తో బస్సు హఠాత్తుగా నెమ్మదించి కదలకపోవడంతో టిప్పర్‌ను ఢీ కొట్టింది. ప్రమాదానికి గంట ముందు కూడా ఆ బస్సు స్టీరింగ్‌ బిగుసుకుపోయింది. యర్రగొండపాలెం వద్ద స్టీరింగ్‌ను అప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతు చేసి బయలు దేరారు. కానీ గంటలోనే రాయవరం చేరుకునేసరికి స్టీరింగ్‌ మరోసారి బిగుసుకుపోయి బస్సు హఠాత్తుగా కదల్లేదు. అదే సమయంలో అటువైపుగా వస్తున్న టిప్పర్‌ లారీని వేగంగా వచ్చి బస్సు ఢీకొట్టింది. 

ఆయిల్‌ ట్యాంకర్‌ను నేరుగా ఢీ కొట్టడంతో వెంటనే బస్సుకు మంటలు అంటుకుని ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి ప్రధాన కారణం బస్సు స్టీరింగ్‌ బిగుసుకుపోవడమే. నడిపేందుకు అత్యంత ప్రధానమైన స్టీరింగే సక్రమంగా పని చేయని బస్సుకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ కావడం నివ్వెరపరుస్తోంది. అంటే కనీసం బస్సులను పరీక్షించకుండానే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు జారీ  చేస్తున్నట్లు ఈ ఉదంతం వెల్లడిస్తోంది. 14 మందిని బలిగొన్న ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన దోషి రవాణా శాఖేనని స్పష్టమవుతోంది.  

ఏటా రూ.80 కోట్ల మామూళ్ల దందా
– రవాణా సిండికేట్‌కు కీలక నేత రింగ్‌ మాస్టర్‌
రాయలసీమకు చెందిన ప్రభుత్వ కీలక నేత రింగ్‌ మాస్టర్‌గా రవాణా శాఖలో పచ్చ సిండికేట్‌ దోపిడీ సాగిస్తోంది. భారీ మొత్తంలో మామూళ్లు వసూలు చేస్తూ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ మాఫియా అక్రమాలకు వత్తాసు పలుకుతోంది. రాష్ట్రంలో 2,200 ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు ఉన్నాయి. ఒక్కో స్లీపర్‌ బస్సుకు దాదాపు 30 బెర్త్‌లు, హైబ్రీడ్‌ మోడల్‌ బస్సుల్లో 20 బెర్త్‌ల చొప్పున ఉంటాయి. ఇక సాధారణ బస్సుల్లో దాదాపు 50 సీట్ల చొప్పున ఉంటాయి. మొత్తం మీద దాదాపు 75 వేల మంది కెపాటిసీతో రాష్ట్రంలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ సంస్థలు బస్సు సర్వీసులను నిర్వహిన్నాయి. 

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిబంధనలను పాటించకుండా దోపిడీకి పాల్పడుతున్నాయి. అందుకు వత్తాసు పలుకుతున్న రవాణా శాఖ మాఫియాకు భారీగా ముడుపులు ముట్టజెబుతున్నాయి. రవాణా శాఖ వర్గాలు అనధికారికంగా వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం... ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఒక్కో బస్సు సర్వీసులో రోజుకు ఒక సీటు టికెట్‌ మొత్తం ఈ సిండికేట్‌కు కమీషన్‌గా ఇస్తున్నారు. ఆ ప్రకారం 2,200 బస్సుల్లో రోజుకు 2,200 టికెట్ల మొత్తాన్ని రవాణా శాఖ సిండికేట్‌కు కమీషన్‌గా చెల్లిస్తున్నారు. 

ఒక టికెట్‌ మొత్తం సగటున రూ.వెయ్యి అనుకుంటే  రోజుకు రూ.22 లక్షలు కమీషన్‌గా ముట్టజెబుతున్నారు. ఆ ప్రకారం నెలకు రూ.6.60 కోట్లు... ఏడాదికి దాదాపు రూ.80 కోట్లు రవాణా శాఖ సిండికేట్‌ వసూలు చేస్తోంది. అంత భారీ మొత్తం లంచాలుగా చెల్లిస్తుండటంతోనే ప్రైవేట్‌ ట్రావెల్స్‌ మాఫియా బరితెగించి దోపిడీకి పాల్పడుతోంది. బస్సుల నిర్వహణలో కనీస నిబంధనలను పాటించడం లేదు. దాంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తూ ప్రయాణికులు దుర్మరణం పాలవుతున్నారు. అవి ఎలా అంటే...

రాష్ట్రంలో 2,200 ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల్లో 90 శాతం కేంద్ర పాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేసి నిబంధనలకు విరుద్ధంగా ఏపీలో సర్వీసులు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టు క్యారియర్లుగా రిజిస్ట్రేషన్‌ చేయించి నిబంధనలకు విరుద్ధంగా స్టేజ్‌ క్యారియర్లుగా నిర్వహిస్తున్నారు. మార్కాపురం వద్ద ప్రమాదానికి గురైన బస్సు కూడా అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంట్రాక్టు క్యారియర్‌గా రిజిస్ట్రేషన్‌ చేసి నిబంధనలకు విరుద్ధంగా జగిత్యాల నుంచి ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా కలిగిరి వరకు స్టేజ్‌ క్యారియర్‌గా నిర్వహిస్తుండటం గమనార్హం.

⇒ బస్సుల బాడీల తయారీలో నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రధానంగా స్లీపర్‌ బస్సుల విషయంలో నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. ఆ బస్సులకు ఫిట్‌నెస్‌ సక్రమంగా ఉండటమే లేదు.

⇒ టికెట్ల ధరలు భారీగా పెంచి దోపిడీకి పాల్పడుతున్నారు. సంక్రాంతి, దసరా సీజన్‌లో  టికెట్‌ ధరను మూడు నాలుగు రెట్లు పెంచి మరీ దోపిడీ చేస్తున్నారు. సాధారణ రోజుల్లో కూడా నిర్దేశిత టికెట్‌ ధరలు ఉండవు.

ఏటీఎస్‌ కేంద్రాలూ అంతే...
వాహనాల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు జారీ చేసే ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ సెంటర్ల (ఏటీఎస్‌) నిర్వాహకులు రవాణా శాఖ సిండికేట్‌కు భారీగా మామూళ్లు ముట్టజెబుతున్నారు. దాంతో ఆ ఏటీఎస్‌ సెంటర్లు ఎలా పని చేస్తున్నాయన్నది రవాణా శాఖ పట్టించుకోవడమే లేదు. ఇక కీలక నేత అండ ఉండటంతో ఏటీఎస్‌ సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. అడిగినంత డబ్బులు ఇస్తే చాలు ప్రైవేట్‌ వాహనాలను కనీసం పరీక్షించకుండానే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం బస్సు స్టీరింగ్, బ్రేకులు, ఇంజన్, బాడీ, హెడ్‌లైట్లు, వెనుకవైపు లైట్లు, ఆయిల్‌ సిస్టం, టైర్లు... ఇలా అన్నీ నిశితంగా పరీక్షించాలి. 

అందుకోసం ఏటీఎస్‌లో కంప్యూటరైజ్డ్‌ విధానంలో క్షుణ్ణంగా పరీక్షించి... తగిన ప్రమాణాల మేరకు ఉంటేనే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు జారీ చేయాలి. కానీ 50 శాతం ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు ప్రమాణాలను పాటించడ లేదు.  ఏటీఎస్‌ సెంటర్ల నిర్వాహకులు భారీగా ఫీజులు చెల్లిస్తే చాలు... ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు జారీ చేసేస్తున్నారు. అందులో రవాణా సిండికేట్‌కు వాటాలిస్తున్నారు. ఈ అవినీతి బాగోతంతో  ప్రయాణికులు తమ  ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోంది. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఉన్నా సరే స్టీరింగ్‌ పని చేయక ప్రమాదానికి గురైన హరికృష్ణ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదమే అందుకు తాజా తార్కాణం.

రెండు రోజులు హడావుడి..
గతేడాది అక్టోబరులో కర్నూలు జిల్లాలో ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు అగ్ని ప్రమాదానికి గురై 19 మంది దుర్మరణం చెందారు. ఆ వెంటనే రాష్ట్రంలో రవాణా శాఖ అధికారులు హడావుడి చేశారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల తనిఖీలు చేపట్టారు. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు పేరుతో కొన్నాళ్లు కనికట్లు చేశారు. అయితే ప్రైవేట్‌ ట్రావెల్స్‌ మాఫియా.. ప్రభుత్వ కీలక నేతను ఆశ్రయించడంతో వెంటనే తనిఖీలు నిలిచిపోయాయి. కేవలం రెండు రోజుల్లోనే ఆ విషయాన్ని పక్కనపెట్టేశారు. ఆ ఫలితమే... మార్కాపురం జిల్లాలో తాజాగా బస్సు ప్రమాదం. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల ఫిట్‌నెస్‌ను సక్రమంగా పరీక్షించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement