రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 5లో రాజధానిగా అమరావతి చేర్పు
2025లో కేబినెట్ ఏపీ రాజధాని అమరావతిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపింది
భవిష్యత్‌లో ఎవరొచ్చినా మార్చకుండా ఉండేందుకే ఈ తీర్మానం
కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి పార్ధసారథి.. రైతులను
నమ్మించి రెండోవిడత పూలింగ్ చేయడానికేనా అన్న ప్రశ్నకు జవాబు దాటవేత
నంద్యాల జిల్లాలో టీడీపీ కార్యాలయానికి రెండు ఎకరాల ప్రభుత్వ భూమి
ఎకరం రూ.1000 చొప్పున 33 ఏళ్లపాటు లీజు
మున్సిపాల్టీల్లో ఆస్తిపన్నుపై వడ్డీలో 50 శాతం మాఫీ
సాక్షి, అమరావతి: రేపు అధికారంలోకి ఎవరైనా వచ్చి రాజధాని అమరావతిని మార్చుతారేమోననే జాగ్రత్తలో భాగంగానే శనివారం అసెంబ్లీలో ఏపీ రాజధాని అమరావతిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచార శాఖ మంత్రి కె.పార్ధసారథి చెప్పారు. మంత్రివర్గ సమావేశం నిర్ణయాలను మంత్రి పార్ధసారథి మీడియాకు వెల్లడించారు. తీర్మానం అవసరం లేనప్పటికీ మా జాగ్రత్త కోసం తీర్మానం చేస్తున్నామని మంత్రి చెప్పారు.
రేపు ఎవరైనా అధికారంలోకి వచ్చి రాజకీయ, ప్రాంతీయ కారణాలతో రాజధాని అమరావతిని మార్చకుండా ఉండేందుకే ఏపీ శాశ్వత రాజధాని అమరావతిగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. 2025 మేలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఏపీ రాజధాని అమరావతిగా నెంబర్ 148 తీర్మానం చేసి కేంద్రానికి పంపామని మంత్రి చెప్పారు. అయినప్పటికీ భవిష్యత్‌లో ఎవరైనా వచ్చి రాజధాని అమరావతిని మార్చాలనే ఆలోచన చేయకుండా ఉండేందుకే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్ 5లో సవరణలు చేయాలని, సెక్షన్–5లోని ఉప సెక్షన్ (2)లో ఏపీ రాజధాని అమరావతిగా చేర్చాలని, అలాగే రాజధాని ప్రాంతం ఏపీసీఆర్‌డీఏగా చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. రైతులను నమ్మించి రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేయడం కోసమే తీర్మానం చేస్తున్నారా అనే ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ రాజధాని అమరావతి అని హైకోర్టు చెప్పిందని రైతులు నమ్మారన్నారు.
రాజధాని విస్తరణ కోసం ల్యాండ్ పూలింగ్ ఎప్పుడైనా చేసే అవకాశం సీఆర్‌డీఏ చట్టంలో ఉందని మంత్రి చెప్పారు. రాజధాని విషయంలో చట్టం ఉంది కదా మళ్లీ తీర్మానం ఎందుకని ప్రశ్నించగా శాశ్వతంగా ఏపీ రాజధాని అమరావతి ఉండాలనే ఉద్దేశంతోనూ, ఎవరు అధికారంలోకి వచ్చినా మార్చడానికి వీల్లేకుండా ఉండేందుకే అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించామన్నారు.
శాసన మండలిలో తరువాత తీర్మానం చేస్తారేమోనని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. రాజధానిలో కాంట్రాక్టు సంస్ధల పైపులు అగ్ని ప్రమాదాలకు గురికావడంపై విచారణ జరుగుతోందన్నారు. ఎల్ అండ్ టీ వంటి పెద్ద సంస్ధలు ఇన్సూరెన్స్ కోసం ఇలాంటి పనులు చేస్తాయనుకోవడం లేదని మంత్రి చెప్పారు. పైపులు అగ్నికి ఆహుతి అవ్వాలంటే తగలపెడితే గానీ కావని మంత్రి చెప్పారు. మంత్రివర్గ సమావేశం తీసుకున్న మరిన్ని నిర్ణయాలు ఇలా..
⇒ నంద్యాల జిల్లా నంద్యాల అర్బన్ మండలం నూనెపల్లెలో ప్రభుత్వ భూమి రెండు ఎకరాలను తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం 33 సంవత్సరాల లీజు పద్దతిలో ఎకరాకు సంవత్సరానికి రూ.1000లు లీజు చొప్పున నంద్యాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షునికి ఇచ్చేందుకు ఆమోదం.
⇒ గుంటూరు జిల్లా నీరుకొండలో ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీ భవనాల నిర్మాణాలకు 60 మీటర్ల ఎత్తు వరకు ఆమోదం.
⇒ హైకోర్టు సూచన మేరకు 96 కొత్త కోర్టులు ఏర్పాటునకు, ఆ కోర్టులకు అవసరమైన 1730 పోస్టులు సృష్టించడానికి ఆమోదం.
⇒ వడ్డెర సంఘాలకు క్వారీ లీజుల్లో ప్రాధాన్యత ఇస్తూ వారికి 15 శాతం క్వారీలు రిజర్వ్ చేసేందుకు, సీనరేజ్ ఫీజులో 50 శాతం రాయితీ ఇచ్చేందుకు ఆమోదం.
⇒ మున్సిపాలిటీల్లో పేరుకు పోయిన ఆస్తి పన్నుపై వడ్డీలో 50 శాతం మాఫీకి ఆమోదం. పన్ను బకాయి మొత్తంతో పాటు 50 శాతం వడ్డీ ఒకే సారి చెల్లిస్తే మిగతా 50 శాతం వడ్డీ మాఫీ వర్తిస్తుంది. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో 76 సంస్థలు వసూళ్లలో వెనుకబడ్డాయి. సుమారు రూ. 2,409 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో, టాక్స్ కట్టేవారికి భారం తగ్గించి వసూళ్లు పెంచుకోవడానికి ఈ నిర్ణయం.
⇒ ప్రస్తుతం దీపం–2 పథకం కింద ఎల్‌పిజి కనెక్షన్ ఉన్న లబ్ధిదారులు పైప్ గ్యాస్‌కు (పీఎన్‌జీకి) మారితే వారికి ఏడాదికి మూడు సిలిండర్లకు ఇస్తున్న సబ్సిడీ రూ.2,400లు వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసేందుకు ఆమోదం.
⇒ రాష్ట్రంలో ప్రైవేట్ కోచింగ్ సంస్థల నియంత్రణ, రిజిస్ట్రేషన్ పర్యవేక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ కోచింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ (రెగ్యులేషన్ అండ్ కంట్రోల్) రూల్స్, 2026’ ముసాయిదా నోటిఫికేషన్ జారీకి ఆమోదం. ఈ నిబంధనల ద్వారా అన్ని కోచింగ్ సెంటర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. విద్యార్దులపై విద్యాపరమైన ఒత్తిడిని తగ్గించి, ఆందోళనలు, ఆత్మహత్యలను నివారించడానికి కౌన్సెలింగ్ సేవలు, మానసిక ఆరోగ్య మద్దతును ఈ నిబంధనలు తప్పనిసరి చేస్తాయి.
⇒ అలాగే సంస్థలు నాణ్యమైన బోధనతో పాటు కనీస మౌలిక సదుపాయాలు, భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలి.
⇒ అమరావతిలో చేపట్టే పనులకు సూపర్ విజన్ చార్జీలను ప్రస్తుతం ఉన్న 15 శాతం నుంచి 2.5 శాతం తగ్గించేందుకు ఆమోదం.
⇒ శ్రీ సత్య సాయి జిల్లాలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఫేజ్–2 పరిధిలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌ను సిమెంట్ కాంక్రీట్ లైనింగ్‌తో ఆధునీకరించే పనికి రూ.169.80 కోట్లకు పరిపాలన అనుమతికి ఆమోదం.
⇒ హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఫేజ్–1 ప్యాకేజీ 36 ఏలో మిగిలిన పనులకు 606.03 కోట్లకు పరిపాలన అనుమతికి ఆమోదం.
⇒ పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు భూమి, కాలనీల పునరావాసం కల్పించేందుకు మొత్తం 4520.52 ఎకరాల భూ సేకరణకు ఎకరాకు రూ.12,50,000లు పరిహారం చొప్పున రూ.565.06 కోట్లకు ఆమోదం.
⇒ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్, హైదరాబాద్‌కు అప్పగించిన ’పోలవరం లిఫ్ట్ స్కీమ్’ పనిని కొనసాగించడానికి ఆమోదం.
⇒ పలు విద్యుత్ ప్రాజెక్టులకు భూముల కేటాయింపులకు ఆమోదం.


