మునుగోడులో ఏ పార్టీ బలమెంత?.. ‘గులాబీ’కి కష్టమేనా?.. బీజేపీ పరిస్థితి ఏంటి? | Sakshi
Sakshi News home page

Munugode Politics: మునుగోడులో ఏ పార్టీ బలమెంత?.. ‘గులాబీ’కి కష్టమేనా?.. బీజేపీ పరిస్థితి ఏంటి?

Published Fri, Aug 26 2022 8:19 PM

Will The Munugode Result Change The Future Of Telangana - Sakshi

సాక్షి, నల్గొండ: నల్గొండ జిల్లా అంటే ఒకప్పుడు ఉద్యమాల ఖిల్లా. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది గతంలో. కాల క్రమంలో కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక పోటీ కారు, హస్తం గుర్తుల మధ్యే ఉంటోంది. ప్రేక్షక పాత్ర పోషిస్తున్న బీజేపీకి మునుగోడు రూపంలో బలం పరీక్షించుకునే ఛాన్స్ వచ్చింది. మునుగోడు ఫలితమే రాష్ట్ర భవిష్యత్‌ని, ఉమ్మడి జిల్లా భవిష్యత్‌ను తేల్చుతుందా?
చదవండి: రాజాసింగ్‌ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో గులాబీ పార్టీ హవా కొనసాగుతోంది. గత ఎన్నికల్లో 12కి 9 స్థానాలు గెలుచుకోగా.. తర్వాత మరో రెండు కలిసాయి. ఎంపీగా గెలిచిన అప్పటి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి హుజూర్‌నగర్ అసెంబ్లీ సీటుకు రాజీనామా చేయగా ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికలో ఉత్తమ్ నిలిపిన అభ్యర్థి ఓడిపోయి టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. మునుగోడు ఒక్కటే కాంగ్రెస్‌కి మిగిలింది. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా మునుగోడు అసెంబ్లీ సీటుకు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా సమర్పించారు. మునుగోడులో జరిగే ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలను అనేక మలుపులు తిప్పే అవకాశం కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీకి గతంలో వచ్చినన్ని స్థానాలు రావనే టాక్ వినిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కొంతమంది ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. ఇదే విషయం గులాబీ బాస్ దృష్టికి కూడా వెళ్లినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. దీనికి తోడు నియోజకవర్గాల్లో వర్గపోరు కూడా టీఆర్ఎస్‌కు సంకటంగా మారింది. జిల్లాలో వర్గపోరు లేని సెగ్మెంట్ ఏదైనా ఉందంటే అది సూర్యాపేట మాత్రమే. తుంగతుర్తి, నల్లగొండ, హుజూర్ నగర్లో గ్రూప్ తగాదాలు ఉన్నా అవి బయటకి కనిపించే స్థాయిలో లేదు. ప్రతీ నియోజకవర్గంలో పార్టీ నేతలు వర్గాలుగా విడిపోయి వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని వినిపిస్తోంది.

నల్లగొండలో కమలం జెండా ఎగరేస్తాం అని ఆ పార్టీ నేతలు చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. మొత్తం పన్నెండు సెగ్మెంట్లలో నాలుగు స్థానాల్లో మాత్రమే కమలం పార్టీ అంతో ఇంతో పోటీ ఇస్తుంది కానీ అది గెలిచేందుకు సరిపోదనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఆలేరు, భువనగిరి, మునుగోడు, సూర్యాపేట మాత్రమే బీజేపీ కనీస పోటీనిచ్చే స్థితిలో ఉంది. నల్లగొండ జిల్లాలో కనీసం ఐదు స్థానాల్లో విజయం సాధించాలని రాష్ట్ర నేతలు ఆలోచిస్తూ తరచుగా పర్యటిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో నేతలు అందుకు విరుద్ధంగా పనిచేస్తున్నారనే టాక్ ఉంది. కాని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూపంలో మునుగోడులో కమలం పార్టీ అదృష్టాన్ని పరిక్షించుకునే అవకాశం దక్కింది.

నల్గొండ జిల్లాలో ఉన్న సీట్లను కాపాడుకోలేకపోతున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎన్నికల్లో అన్ని సీట్లూ తమవారికే కావాలని కోరుతున్నారు. గతంలో జిల్లాలోని మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచేది. కురువృద్ధులు ఆ పార్టీకి దన్నుగా ఉండేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ వైభవం గత చరిత్రగా మిగిలిపోతోంది. గత ఎన్నికల్లో మూడు సీట్లు గెలుచుకోగా ఉప ఎన్నికలో ఒకటి కోల్పోయింది. మరొకరు గులాబీ పార్టీలోకి జంప్ చేశారు. చివరికి మిగిలిన మునుగోడు ఎమ్మెల్యే పీసీసీ చీఫ్ రేవంత్ కారణంగా పార్టీకి, పదవికి గుడ్ బై చెప్పి.. కమలం తీర్థం తీసుకోబోతున్నారు. అంటే ప్రస్తుతం నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా మిగల్లేదని చెప్పాలి.

గత అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఫలితాలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీకి కేడర్ పటిష్టంగానే ఉంది. అసెంబ్లీ స్థానాలు పోయినా.. ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భువనగిరి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీ సీట్లను కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలనే పట్టుదలగా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. అయితే రేవంత్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కమలం గూటికి చేరడం కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టే అంశమే. అయితే అన్ని సెగ్మెంట్లలో వర్గపోరుతో పాటు.. సీట్లు అడిగేవారి సంఖ్య కూడా కాంగ్రెస్‌లో ఎక్కువగానే ఉంది. ఉత్తమ్‌కుమార్, జానారెడ్డి తదితర సీనియర్ నాయకులు తమకు తమ కుటుంబానికి ఎక్కువ స్థానాలు కావాలని పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement