బెంగాల్‌ ఎన్నికలు: వీడియో ఎపిసోడ్‌తో బిగ్‌ షాక్‌ | West Bengal Elections 2026: New Twist In Humayun Kabir Video Episode | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ ఎన్నికలు: వీడియో ఎపిసోడ్‌తో బిగ్‌ షాక్‌

Apr 10 2026 9:29 AM | Updated on Apr 10 2026 11:16 AM

West Bengal Elections 2026: New Twist In Humayun Kabir Video Episode

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల వేళ.. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంటర్నెట్‌లో వదిలిన ఓ వీడియో రాజకీయ ప్రకంపనలు రేపింది. ఆమ్‌ జనతా ఉన్నయన్‌ పార్టీ అధినేత హుమాయున్‌ కబీర్‌.. బీజేపీతో చేతులు కలిపి మైనారిటీల ఓట్లను మళ్లించే కుట్ర చేశాడన్నది ఆ వీడియో సారాంశం. అయితే ఆ వీడియోను కబీర్‌ ఖండించినప్పటికీ నష్టం జరిగిపోయింది. 

తృణమూల్ కాంగ్రెస్ విడుదల చేసిన స్టింగ్ ఆపరేషన్‌ వీడియోతో బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేగింది. ఆ వీడియోలో హుమాయున్ కబీర్.. బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నాడని, మైనారిటీ ఓట్లను మళ్లించేందుకు భారీ నిధులు పొందాడని ఉంది. ఏకంగా ప్రధాని కార్యాలయం ఈ కుట్రలో భాగమైందని.. సువేందు అధికారి, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మలతో సమన్వయం చేసుకోవాలని పీఎంవో సూచనలు చేసినట్లు ఉంది. అంతేకాదు.. 

ముస్లింలను మోసం చేయడం సులభమని.. ఇందుకు బాబ్రీ మసీదు అంశమే ఉదాహరణ అని హుమాయున్‌ కబీర్‌ వ్యాఖ్యలు చేసినట్లుగా ఉంది. బెంగాల్‌ ఓట్లలో ముస్లిం ఓట్లను మళ్లించేందుకు బీజేపీ నుంచి రూ.200 కోట్లు ముందస్తు నిధులు కబీర్‌ పొందినట్లు టీఎంసీ సంచలన ఆరోపణలకు దిగింది. దాదాపు రూ.1000 కోట్లతో ఈ కుట్రకు తెర లేపారని ఆరోపించిన టీఎంసీ.. ఈ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేసింది. 

ఈ ఆరోపణలపై బీజేపీ ఇంకా స్పందించలేదు. అయితే హుమాయున్ కబీర్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. అది ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో తీసిన వీడియో అని.. 2019 నవంబర్ తర్వాత ఏ బీజేపీ నేతతోనూ తాను టచ్‌లో లేనని.. ఇది తృణమూల్ నేతల దుష్ప్రచారమని.. పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. అయినప్పటికీ ఈ వివాదం వెంటనే రాజకీయ ప్రభావం చూపింది. 

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల కోసం ఎంఐఎం పార్టీ ఆమ్‌ జనతా ఉన్నయన్‌ పార్టీతో పొత్తు పెట్టుకుంది. తాజా వీడియో కలకలం నేపథ్యంలో.. ఆ కూటమిని రద్దు చేస్తున్నట్లు ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌(తెలంగాణ) ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. బెంగాల్‌ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. 

హుమాయున్ కబీర్ మాజీ ఐపీఎస్‌ అధికారి. టీఎంసీలో చేరి రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా నెగ్గి.. మంత్రిగా పని చేశారు. బీజేపీలో చేరి అక్కడా కొంత కాలం ఉన్నారు. తిరిగి టీఎంసీలో చేరారు. అయితే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచేవారు. గత ఏడాది ముర్షీదాబాద్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బాబ్రీ మసీదు నమునాతో అక్కడ ఓ మసీదు నిర్మిస్తానని చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అ‍య్యాయి. విమర్శల నేపథ్యంలో.. టీఎంసీ ఆయన్ని బహిష్కరించగా ఏజేయూపీ పేరిట కొత్త పార్టీ స్థాపించాడాయన. తాజా వివాదం ఎన్నికల ముందు మైనారిటీ ఓట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం.. 294 స్థానాలకు ఎన్నికలు ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement