
తిరువనంతపురం: ప్రముఖ కమ్యూనిస్టు నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి వెలిక్కకట్టు శంకరన్ అచ్యుతానంద కన్నుమూశారు. ఈ రోజు (సోమవారం, జూలై 21, 2025) త్రివేండ్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. 101 ఏళ్ల వయసు కల్గిన అచ్యుతానంద వృద్ధాప్య భారంతో అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఇక ఆయన 2006 నుండి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా సేవలందించారు. 1923లో జన్మించిన అచ్యుతానందన్ సీపీఐఎం స్థాపక సభ్యుల్లో ఒకరు. విపక్ష నాయకుడిగా 15 సంవత్సరాలు పనిచేశారు. ఇది కేరళ అసెంబ్లీ చరిత్రలో అత్యధిక కాలం.
ఉద్యమాలతో స్పూర్తి
ఓ వైపు క్రియా శీలక రాజకీయాల్లో కొనసాగుతూ.. మరో వైపు పలు ఉద్యమాలు చేశారు. పున్నప్ర-వయలార్ ఉద్యమం, మునార్ భూసేకరణ, లాటరీ మాఫియాపై పోరాటం, ఫిల్మ్ పైరసీపై ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేశారు. ఆయన చేసిన ఉద్యమాల కారణంగా 5 ఏళ్ల పాటు జైలు జీవితం, 4.5 సంవత్సరాల పాటు రహస్య జీవితాన్ని గడిపారు
రాజకీయ జీవితం
1940లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు.1964లో సీపీఐ నుంచి బయటకు వచ్చారు. సీపీఎం స్థాపనలో కీలక పాత్ర పోషించారు. 1985లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులై, 2009లో పార్టీ అంతర్గత విభేదాల కారణంగా తొలగించబడ్డారు. 2016 తర్వాత ఆరోగ్య సమస్యల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
అచ్యుతానందన్ మరణంతో కేరళ రాజకీయ రంగం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. ఆయన ధైర్యం, నిబద్ధత, ప్రజల పట్ల ప్రేమ ప్రజల మనసుల్లో చిర స్థాయిగా నిలిచిపోతాయని రాజకీయ ప్రముఖులు కేరళ రాష్ట్రానికి అచ్యుతానందన్ చేసిన సేవల్ని కొనియాడుతున్నారు.
