విజయ్‌ తీసుకొచ్చిన విప్లవం ఇదే.. ఇక భవిష్యత్‌ అంతా ఇలానే..! | Vijay alters caste women matrix | Sakshi
Sakshi News home page

విజయ్‌ తీసుకొచ్చిన విప్లవం ఇదే.. ఇక భవిష్యత్‌ అంతా ఇలానే..!

May 6 2026 3:53 PM | Updated on May 6 2026 8:00 PM

Vijay alters caste women matrix

చెన్నై: అసలైన ప్రజాస్వామ్యం అంటే ఏంటో నిరూపించాయి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు. అన్ని వర్గాలకు చెందిన వారూ ఎమ్మెల్యేలుగా గెలిచారు. సామాజిక న్యాయం దిశగా వెళ్లాలంటే ఇటువంటి ఫలితాలు అవసరమని విశ్లేషకులు అంటున్నారు. రాజకీయాల్లో అన్ని లెక్కలను సరి చేశారు టీవీకే విజయ్‌. ఎందరో ఉద్ధండులకూ సాధ్యం కానిది సాధించి చూపించారు. ఎంజీఆర్‌, కరుణానిధి, జయలలిత వంటి వారూ చూపించని మార్పును చూపించారు. ఓటర్లలో మార్పు తీసుకొచ్చారు.

వృత్తులను చూడలేదు 
వీధుల్లో ఆటో డ్రైవింగ్ చేసుకునే పని నుంచి అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా ప్రవేశం వరకు ఎదిగారు ఓ ఆటోడ్రైవర్‌. అలాగే, విజయ్ కారు డ్రైవర్ కుమారుడు కూడా గెలిచి అసెంబ్లీలోకి ప్రవేశించారు.  

రాయపురం ఆటో డ్రైవర్ కేవీ విజయ్‌ దామూ అదే నియోజక వర్గం నుంచి గెలిచారు. అలాగే, విజయ్ కారు డ్రైవర్ కుమారుడు కూడా గెలిచి అసెంబ్లీలోకి ప్రవేశించారు. విజయ్‌కు దీర్ఘకాలికంగా సహాయకుడిగా ఉంటున్నారు కారు డ్రైవర్‌ రాజేంద్రన్. ఆ డ్రైవర్‌ కుమారుడు ఆర్ శబరినాథన్ విరుగంబాక్కం అసెంబ్లీ స్థానంలో టీవీకే తరఫున గెలిచారు.

ఇద్దరు సాధారణ వ్యక్తులు సాధించిన ఈ అతి పెద్ద విజయం.. గొప్ప సందేశాన్ని ఇచ్చింది. రాజకీయాలు ఇకపై కేవలం శక్తిమంతమైన కుటుంబాలకే పరిమితం కాదని నిరూపించింది. ఓటర్లు అన్ని వర్గాల వారినీ ఆదరిస్తారని చాటి చెప్పింది.

కులాలను చూడలేదు
ఎవరికి ఓటు వేస్తావని అడిగితే ‘మా కులం వాళ్లకే ఓటు వేస్తా’మని అంటారు చాలామంది. తమిళనాడులోనూ కుల వ్యవస్థ బలంగా ఉంది. ఈ కుల అడ్డుగోడలను దాటి మరీ ఈ సారి ప్రజలు ఓట్లు వేశారని చెప్పుకోవచ్చు. ఇటువంటి వారి నుంచి టీవీకే సామాజికంగా భారీ మద్దతు సంపాదించింది. అసెంబ్లీలో బ్రాహ్మణ ప్రాతినిధ్యాన్ని మళ్లీ తీసుకువచ్చింది. ఇది ప్రధాన ద్రావిడ పార్టీల దృష్టికి ఎక్కువగా రాని అంశం, రాష్ట్ర ఎన్నికల విధానంలో మార్పును సూచిస్తోంది.

టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ క్రిస్టియన్ మతాన్ని ఆచరించే వ్యక్తి. ఆయన నేతృత్వంలో పార్టీ సాంప్రదాయ కుల సమీకరణాలను దాటేసి.. అభ్యర్థుల ఎంపిక, స్థానికుల నుంచి నమ్మకాన్ని పెంపొందించడానికే ప్రాధాన్యం ఇచ్చింది.షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ గిరిజనుల (ఎస్టీ) నుంచి 20కి పైగా ఎమ్మెల్యేలు, మైలాపూర్, శ్రీరంగం నుంచి ఇద్దరు బ్రాహ్మణులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.

మైలాపూర్‌లో పి.వెంకటరమణన్, శ్రీరంగంలో రమేశ్‌ గెలుపును రాజకీయంగా ప్రాధాన్యంగా భావిస్తున్నారు. బ్రాహ్మణ అభ్యర్థులను నిలబెట్టడానికి ప్రధాన ద్రావిడ పార్టీలు వెనకడుగు వేస్తాయి. వారి సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఓటింగ్‌లో ఆధిపత్య కులాల ప్రభావంతో ఓడిపోవచ్చు అనే భయం పార్టీల్లో ఉంటుంది. అయినప్పటికీ, టీవీకే వారిని అభ్యర్థులుగా నిలబెట్టింది. వారు గెలవడం ఇప్పటి వరకు ఉన్న ఎన్నికల విధానానికి భిన్నంగా జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 46 రిజర్వు స్థానాలు ఉన్నాయి. టీవీకే అభ్యర్థులు వాటిలో 24 స్థానాల్లో గెలిచారు. మిగిలిన 22 రిజర్వు స్థానాల్లో డీఎంకే కూటమి (13), ఏఐఏడీఎంకే (9) గెలిచాయి. సంప్రదాయ కూటములు కొన్ని ప్రాంతాల్లో బలాన్ని నిలబెట్టుకున్నా, టీవీకే భారీ ప్రభావాన్ని చూపించింది.

టీవీకే అభ్యర్థి విరుధునగర్‌లో షెడ్యూల్డ్ కుల అభ్యర్థి పి.సెల్వం జనరల్‌ స్థానంలో పోటీ చేసి వి.విజయ్ ప్రభాహరణ్‌ను ఓడించారు. ఎస్సీ అభ్యర్థి జనరల్‌ స్థానంలో గెలవడం వల్ల ఈ ఎన్నికలో కుల లెక్కలు పనిచేయలేదని స్పష్టమవుతోంది.

రిజర్వు, సాధారణ స్థానాల్లో రెండింట్లోనూ వెనుకబడిన వర్గాల అభ్యర్థులు టీవీకే తరఫున గెలిచారు. ఇది కుల, మత గీతలను దాటిన సమీకరణాన్ని సూచిస్తోంది. భవిష్యత్తు రాజకీయాల్లోనూ ఇదే ధోరణి కనపడితే మనం కోరుకుంటున్న సమసమాజం వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

టీవీకే నుంచి 13.. డీఎంకే నుంచి 0  
తమిళనాడు శాసనసభకు 23 మంది మహిళా సభ్యులు ఎన్నికయ్యారు. గత శాసనసభలో కేవలం 12 మందే ఉండేవారు. తమిళనాడు చరిత్రలో 23 కంటే ఎక్కువ మంది మహిళలు ఎన్నికైన సందర్భాలు గతంలో కేవలం రెండుసార్లు మాత్రమే ఉన్నాయి. ఇటీవల వెల్లడైన ఫలితాల్లో టీవీకే నుంచి 13 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఏఐఏడీఎంకే నుంచి ఆరుగురు ఉన్నారు. డీఎంకే 19 మంది మహిళలను పోటీకి దింపినా ఒక్కరు కూడా గెలవలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement