‘జూన్ 10లోపు విద్యుత్ స‌బ్సిడీ హామీ అమ‌లు చేయాలి’ | Vaddi Raghuram Fires On Issues Facing Aqua Farmers In Chandrababu Govt | Sakshi
Sakshi News home page

‘జూన్ 10లోపు విద్యుత్ స‌బ్సిడీ హామీ అమ‌లు చేయాలి’

May 30 2026 3:02 PM | Updated on May 30 2026 3:22 PM

Vaddi Raghuram Fires On Issues Facing Aqua Farmers In Chandrababu Govt

సాక్షి, తాడేప‌ల్లి: ఆక్వా, నాన్ ఆక్వా జోన్‌తో సంబంధం లేకుండా జూన్ 10వ తేదీ లోపు యూనిట్ రూపాయిన్న‌ర‌కే స‌బ్సిడీ విద్యుత్ హామీని అమ‌లు చేయాల‌ని, నాన్ ఆక్వా జోన్ రైతులు గ‌త రెండేళ్లుగా చెల్లించిన బిల్లులు రీయింబ‌ర్స్ చేయాల‌ని తాడేప‌ల్లిగూడెం నియోజ‌క‌వ‌ర్గ  వైఎస్సార్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త, అప్స‌డా మాజీ వైస్ చైర్మ‌న్ వ‌డ్డి ర‌ఘురాం డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోతే వైఎస్సార్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఆక్వా రైతుల‌తో క‌లిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క‌లెక్ట‌రేట్ల‌ను ముట్ట‌డిస్తామ‌ని హెచ్చరించారు.

తాడేప‌ల్లి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఆక్వా, నాన్ ఆక్వా జోన్‌తో సంబంధం లేకుండా అంద‌రికీ రూపాయిన్న‌ర‌కే యూనిట్ విద్యుత్ అందిస్తామ‌ని ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చిన చంద్ర‌బాబు, రెండేళ్లుగా ఒక్క కొత్త క‌నెక్ష‌న్ కూడా ఇవ్వ‌లేద‌ని చెప్పారు. వైఎస్సార్సీపీ హయాంలో సీడ్‌, ఫీడ్ ధ‌ర‌లు, ఎగుమ‌తులు, అన్నీ అప్స‌డా నిర్ణ‌యం మేర‌కు రైతుల‌తో చ‌ర్చించి తీసుకునేవాళ్ల‌మ‌ని.. కానీ కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక ఆక్వా క‌ల్చ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ(అప్స‌డా)ని నిర్వీర్యం చేసేసి ద‌ళారుల చేతికి చంద్ర‌బాబు పెత్త‌నం ఇచ్చాడ‌ని మండిప‌డ్డారు.

ఫీడ్ ధ‌ర‌లు కూడా ఇష్టారాజ్యంగా పెంచితే ఊరుకోమ‌ని, రైతుల‌తో చ‌ర్చించి ఏడాదికి ఒక్క‌సారే పెంచాల‌ని డిమాండ్ చేశారు. ఆక్వా రైతుల‌కు వైఎస్సార్‌సీపీ అండ‌గా ఉంటుంద‌ని, త్వ‌ర‌లోనే ఆక్వా రైతుల‌తో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్‌ స‌మావేశం నిర్వ‌హిస్తార‌ని వ‌డ్డి ర‌ఘురాం వెల్ల‌డించారు. ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే..

అప్స‌డా నిర్వీర్యం.. తీవ్ర సంక్షోభంలో ఆక్వా రంగం
కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక ఆక్వా రంగం తీవ్ర‌మైన సంక్షోభంలో చిక్కుకుంది. వైఎస్‌ జ‌గ‌న్‌ సీఎంగా ఉండ‌గా ఆక్వా క‌ల్చ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (అప్స‌డా)ని ఏర్పాటు చేసి సీడ్ యాక్టు, ఫీడ్ యాక్టు అంటూ అన్ని విభాగాల‌ను ఒకే గొడుకు కింద‌కి తీసుకొచ్చి ఆక్వా రైతుల‌కు మేలు చేశారు. సీడ్‌, ఫీడు ధ‌ర‌లు పెంచాల‌న్నా, వాటి నాణ్య‌త ప‌రిశీలించాల‌న్న ఒక క‌మిటీ ఉండేది. ఈ క‌మిటీలో ప్ర‌భుత్వం, రైతులు, సీడు, ఫీడు య‌జ‌మానులు, ఎక్స్‌పోర్ట‌ర్లు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, మెడిక‌ల్ కంపెనీలు ఉండేవి.

వీరంతా ఉమ్మ‌డిగా చ‌ర్చించి ఏ నిర్ణ‌యమైనా తీసుకునేవారు. రేట్లు పెంచాల‌న్నా, త‌గ్గించాల‌న్నా అప్స‌డాలో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకునేవారు. కానీ ఇప్పుడా ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. కానీ కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక ఆక్వా క‌ల్చ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీని పూర్తిగా నిర్వీర్యం చేసి, పెత్త‌నాన్ని చంద్ర‌బాబు త‌న బినామీల‌కు క‌ట్ట‌బెట్టాడు. పెరిగిన డీజిల్ ధ‌ర‌ల కార‌ణంగా ఆక్వారైతు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నాడు. ఇటీవ‌ల విచ్చ‌ల‌విడిగా ఫీడు రేట్లు పెంచ‌డానికి పూనుకున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ గారి హెచ్చ‌రిక‌ల‌తో ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గింది.

ఒక్క కొత్త క‌నెక్ష‌న్ ఇవ్వ‌లేదు
ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్‌తో సంబంధం లేకుండా అంద‌రికీ స‌బ్సిడీ విద్యుత్ రూపాయిన్న‌ర‌కే ఇస్తామ‌ని ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చిన చంద్ర‌బాబు ఆక్వా రైతుల‌ను మోసం చేశాడు. రెండేళ్ల‌లో చంద్ర‌బాబు కొత్త‌గా ఒక్క కనెక్ష‌న్ కూడా ఇవ్వ‌లేదు. కొత్త‌గా రిజిస్ట్రేషన్ల పేరుతో రెండేళ్లుగా కాల‌యాప‌న చేస్తూనే ఉన్నారు. మొత్తం 64 వేల క‌నెక్ష‌న్లు ఉంటే వైఎస్సార్‌సీపీ హ‌యాంలోనే 50,800 క‌నెక్ష‌న్లు ఇవ్వ‌డం జ‌రిగింది. దీని ద్వారా ఏటా రూ.800 కోట్ల మేర విద్యుత్ స‌బ్సిడీ ఇవ్వ‌డం జ‌రిగింది. 2104-19 మ‌ధ్య కూడా యూనిట్ విద్యుత్ రూ.2 ల‌కే ఇస్తామ‌ని చెప్పి ఆరు నెల‌ల‌కే ఆపేశాడు. 2019లో వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక డిస్కంల‌కు గ‌త టీడీపీ ప్ర‌భుత్వం పెట్టిన బ‌కాయిలు రూ.340 కోట్లు వైఎస్‌ జ‌గ‌నే చెల్లించి ఆక్వా రంగాన్ని ఆదుకోవ‌డం జ‌రిగింది.

ఐదేళ్ల‌లో రూ. 3640 కోట్లు స‌బ్సిడీ రూపంలో చెల్లించిన ఘ‌న‌త వైయ‌స జ‌గ‌న్‌కే ద‌క్కుతుంది. నాన్ ఎలిజిబిలిటీ రైతుల‌కు ఇబ్బందులు రావ‌డంతో 24 గంట‌ల్లో రూ. 24 కోట్లు రోల్ బ్యాక్ చేయ‌డం జ‌రిగింది. మెరైన్ ఎక్స్‌పోర్టులో రెండుసార్లు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దేశంలోనే మొద‌టిస్థానం సాధించి అవార్డులు తీసుకుంది. గ‌తంలో వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వం ఉండ‌గా సీపీఎఫ్ అనే కంపెనీ ఫీడ్ ధ‌ర‌లు పెంచిన‌ప్పుడు రైతులు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకొచ్చారు. కంపెనీ ప్రెసిడెంట్‌, వైస్ ప్రెసిడెంట్‌ల‌ను థాయ్‌లాండ్ నుంచి 48 గంట‌ల్లో పిలిపించి వారితో ప్ర‌భుత్వం చ‌ర్చించి మూడేళ్ల‌పాటు పైసా కూడా పెంచ‌కుండా చూశాం. రెండుసార్లు పెంచితే రెండుసార్లూ రోల్ బ్యాక్ చేయ‌డం జ‌రిగింది.

ఆక్వా రైతుల త‌ర‌ఫున వైఎస్సార్‌సీపీ డిమాండ్లు
సంక్షోభంలో రోడ్డెక్కి నిర‌స‌న తెలియ‌జేస్తున్న ఆక్వా రైతుల ఆక్రంద‌న‌లు ఈ ప్ర‌భుత్వానికి క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికైనా ఆక్వా నాన్ ఆక్వా జోన్‌తో సంబంధం లేకుండా రూపాయిన్న‌ర‌కే స‌బ్సిడీ విద్యుత్ ఎప్ప‌టి నుంచి ఇస్తారో స్పష్టంగా చెప్పాలి. నాన్ ఆక్వా జోన్ ప‌రిధిలో సుమారుగా 12,800 క‌నెక్ష‌న్లు ఉంటాయ‌ని అంచ‌నా. వారంద‌రూ గ‌డిచిన రెండేళ్లుగా విద్యుత్ స‌బ్సిడీకి నోచుకోకుండా బిల్లులు చెల్లిస్తున్నారు. ఆ బిల్లుల‌న్నీ రోల్ బ్యాక్ చేస్తారో లేదో చెప్పాలి. సంక్షోభంలో న‌ష్ట‌ప‌రిహారం చెల్లించి రైతుల‌ను ఆదుకునేలా ఇత‌ర పంట‌ల మాదిరిగానే ఆక్వా లోనూ పంట‌ల సాగు వివ‌రాలు న‌మోదు చేయాలి.

ప్రాసెసింగ్‌ ప్లాంట్ల‌కు వ‌చ్చిన ఆర్డ‌ర్లు, పంట సాగు లెక్క‌ల‌ను బేరీజు వేసుకుని ధ‌ర‌లు నిల‌క‌డ‌గా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాలి. సోయా, ఫిష్ ఆయిల్ ధ‌ర‌లు ఏడాదికి ఒక్క‌సారే పెరుగుతాయి. ఆక్వా సీడు, ఫీడ్‌ ధ‌ర‌లు ఇష్ట‌మొచ్చిన‌ట్టు పెంచ‌కుండా ఏడాదిపాటు ఒకే ధ‌రతోనే విక్ర‌యాలు జ‌రిగేలా చూడాలి. గ‌త వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వంలో మాదిరిగానే ధ‌ర‌లు పెంచాల్సి వ‌స్తే రైతుల అంగీకారం త‌ప్ప‌నిసరిగా తీసుకోవాలి.

జూన్ 10వ తేదీ లోపు జోన్‌తో సంబంధం లేకుండా ఆక్వా రంగంలో రూపాయిన్న‌ర స‌బ్సిడీకి విద్యుత్ పంపిణీ చేయాలి. రెండేళ్లుగా నాన్ ఆక్వా జోన్ రైతులు చెల్లించిన బిల్లును రీయింబ‌ర్స్ చేయాలి. రైతుల డిమాండ్లు నెర‌వేర్చ‌క‌పోతే వైఎస్సార్‌సీపీ ఆధ్వ‌ర్యంలో క‌లెక్టరేట్ల‌ను ముట్ట‌డిస్తాం. త్వ‌ర‌లోనే ఆక్వా రైతుల‌తో వైఎస్‌ జ‌గ‌న్ సమావేశం నిర్వ‌హిస్తారు. ఆక్వా రైతుల‌కు వైఎస్సార్సీపీ అండ‌గా నిల‌బ‌డి పోరాడతుందని వడ్డి రఘురాం స్ప‌ష్టం చేశారు

Advertisement
 
Advertisement
Advertisement