యోగి ఆదిత్యనాథ్‌కు అఖిలేశ్ కౌంట‌ర్‌ | Uttar Pradesh: SP poster sparks Rajbhar Yadav clash, war of words escalates | Sakshi
Sakshi News home page

యోగి య‌మ‌రాజ్ వ్యాఖ్య‌లు.. అఖిలేశ్ ఆరోప‌ణ‌లు

May 28 2026 4:49 PM | Updated on May 28 2026 5:13 PM

Uttar Pradesh: SP poster sparks Rajbhar Yadav clash, war of words escalates

లక్నో: ఉత్తరప్రదేశ్ శాస‌నస‌భ ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో రాజ‌కీయ పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం మొద‌లైంది. అధికార బీజేపీ, విప‌క్ష స‌మాజ్‌వాదీ పార్టీల మ‌ధ్య వాగ్యుద్ధం న‌డుస్తోంది. ఎన్‌కౌంట‌ర్లపై ఇరు పార్టీలు వాదులాడుకుంటున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల చేసిన “యమరాజ్” వ్యాఖ్యలతో ఈ వివాదం మొద‌లైంది. ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఎన్‌కౌంట‌ర్లు చేయింస్తోంద‌ని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించడంతో ఈ వివాదం ముదిరింది. అఖిలేశ్ ఆరోప‌ణ‌ల‌కు ఎన్డీఏ మిత్ర‌ప‌క్షం సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నేత ఓం ప్రకాశ్ రాజ్‌భర్ కౌంట‌ర్ ఇవ్వ‌డంతో వాగ్యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది.

ఉత్తరప్రదేశ్‌లో కులం, రాజకీయ ప్రయోజనాల ఆధారంగా బీజేపీ ప్ర‌భుత్వం ఎన్‌కౌంటర్లు చేయిస్తోంద‌ని అఖిలేశ్ యాద‌వ్ ఆరోపించారు. వీటిలో కొన్ని నకిలీ ఎన్‌కౌంటర్లు కూడా ఉన్నాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు. యోగి ఆదిత్య‌నాథ్ స‌ర్కారు కొన్ని వ‌ర్గాల‌ను ప్ర‌త్యేకంగా టార్గెట్ చేసింద‌న్నారు. అఖిలేశ్ ఆరోప‌ణ‌ల‌కు మ‌ద్ద‌తుగా సమాజ్‌వాదీ పార్టీ యువజన విభాగ నేత పంకజ్ రాజ్‌భర్.. లక్నోలోని పార్టీ కార్యాలయం బయట ఓ భారీ పోస్ట‌ర్‌ను ఏర్పాటు చేశారు. 2024 నుంచి 2026 మధ్య కాలంలో హత్యకు గురైన రాజ్‌భర్ కులానికి చెందిన వారి ఫొటోలు ఇందులో ముద్రించారు. వారణాసి, ఘాజీపూర్, జౌన్‌పూర్, బరాబంకీ, కుషీనగర్, సంత్ కబీర్ నగర్, మౌ, బల్లియా జిల్లాల్లో హ‌త్య‌కు గురైన వారి వివ‌రాలు ఇందులో పేర్కొన్నారు.

ఈ పోస్టర్ రాజకీయంగా యూపీలో తీవ్ర దుమారం రేపింది. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసమే స‌మాజ్‌వాదీ పార్టీ త‌న కార్యాల‌యం ఎదుట‌ ఈ పోస్ట‌ర్ పెట్టింద‌ని ఓం ప్రకాశ్ రాజ్‌భర్ విమ‌ర్శించారు. ప్ర‌భుత్వ ఎన్‌కౌంట‌ర్ల‌ను ఆయ‌న స‌మ‌ర్థించారు. పోస్ట‌ర్‌లో పేర్కొన్న పలువురిపై హత్య, హత్యాయత్నం వంటి తీవ్రమైన నేర కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. అలాంటి నేరస్థులపై పోలీసులు తీసుకునే చర్యలకు రాజకీయ రంగు పులమడం సరికాదని అన్నారు. గతంలో స‌మాజ్‌వాదీ పార్టీ ప్ర‌భుత్వం ఎంతో మంది నేరస్థులను కాపాడింద‌ని ఆయ‌న‌ ఆరోపించారు.

ఎన్నిక‌ల అంశంగా ఎన్‌కౌంట‌ర్లు
2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజ్‌భర్ వర్గం మద్దతు పొంద‌డానికి స‌మాజ్‌వాదీ పార్టీ చేసిన ప్ర‌య‌త్నంగా ఈ వ్యవ‌హారాన్ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. వ‌చ్చే శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ఎన్‌కౌంట‌ర్ల అంశం కీలకంగా మారే అవకాశ‌ముంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ అంశంపై మున్ముందు అధికార, విప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతుంద‌ని భావిస్తున్నారు. 

చ‌ద‌వండి: కేంద్రం నిర్ణ‌యంపై అన్నామ‌లై అభ్యంత‌రం

టికెట్ చిరిగిపోవ‌డం ఖాయం
మ‌హిళ‌లు, అమ్మాయిల జోలికి వ‌స్తే తాట తీస్తామ‌ని హెచ్చరిస్తూ యమరాజు ప‌దాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎక్కువ‌గా ఉచ్చ‌రిస్తున్నారు. మ‌హిళ‌ల‌పై నేరాల‌కు పాల్ప‌డేవారికి క‌ఠిన శిక్ష‌లు అమ‌లు చేస్తామ‌ని, వెంట‌నే వారి టికెట్ కత్తిరించడానికి య‌మ‌రాజు సిద్ధంగా ఉంటాడ‌ని సీఎం యోగి వార్నింగ్ ఇస్తున్నారు. కాగా, ఆయ‌న 9 ఏళ్ల పాల‌న‌లో 17,043 ఎన్‌కౌంట‌ర్లు జ‌రిగిన‌ట్టు గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement