యోగి ఆదిత్యనాథ్‌ వద్దే హోంశాఖ

Uttar Pradesh Cabinet Portfolios: CM Yogi To Hold Home And Security - Sakshi

యూపీలో మంత్రులకు శాఖల కేటాయింపు

ముఖ్యమంత్రి వద్దే 34 శాఖలు

జితిన్‌ ప్రసాదకు పీడబ్ల్యూడీ

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తన మంత్రివర్గ సభ్యులకు సోమవారం శాఖలను కేటాయించారు. కీలకమైన హోం, విజిలెన్స్‌తో సహా 34 శాఖలను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యకు గ్రామీణాభివృద్ధి, ఫుడ్‌ ప్రాసెసింగ్‌తో పాటు మరో నాలుగు శాఖలు అప్పగించారు. మరో ఉప ముఖ్యమంత్రి బ్రిజేశ్‌ పాఠక్‌కు వైద్య విద్యాశాఖతో మరో రెండో ఫోర్ట్‌ పోలియోలు కేటాయించారు.

కళ్యాణ్ సింగ్ మనవడికి చోటు
సురేశ్‌ కుమార్‌ ఖన్నాకు ఆర్థిక, శాసనసభ వ్యవహారాలు, స్వతంత్రదేవ్‌ సింగ్‌కు జలశక్తి, బేబి రాణి మౌర్యకు మహిళా, శిశు సంక్షేమ శాఖ, జితిన్‌ ప్రసాదకు పీడబ్ల్యూడీ కట్టబెట్టారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన మంత్రుల్లో మాజీ ఐపీఎస్‌ అధికారి అసిమ్ అరుణ్(సాంఘిక సంక్షేమం, ఎస్సీ/ఎస్టీ సంక్షేమం), దయా శంకర్ సింగ్‌(రవాణా శాఖ) కళ్యాణ్ సింగ్ మనవడు సందీప్ సింగ్(ప్రాథమిక విద్య) ఉన్నారు. యోగి కేబినెట్‌లో ఏకైక ముస్లిం మంత్రి డానిష్ ఆజాద్ అన్సారీ(స్వతంత్ర ప్రతిపత్తి)కి వక్ఫ్, హజ్ శాఖలతో పాటు మైనారిటీల సంక్షేమం అప్పగించారు. ఏకైక సిక్కు మంత్రి బల్దేవ్ సింగ్ ఔలాఖ్‌(స్వతంత్ర ప్రతిపత్తి) వ్యవసాయం, వ్యవసాయ విద్య శాఖ దక్కించుకున్నారు. 

24 మందికి ఉద్వాసన
సీఎం యోగి కేబినెట్‌లో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులతో పాటు 52 మంది మంత్రులు ఉన్నారు. మంతివర్గంలో 31 కొత్త ముఖాలకు స్థానం కల్పించగా, పాతవారిలో 24 మందికి ఉద్వాసన పలికారు.  గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన దినేష్ శర్మకు ఈసారి మొండిచేయి చూపారు. మథుర బీజేపీ ఎమ్మెల్యేతో పాటు మొదటి టర్మ్‌లో ఇంధన శాఖ మంత్రి శ్రీకాంత్ శర్మ, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన సతీష్ మహానాలకు కూడా తాజా కేబినెట్‌లో చోటు దక్కలేదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top